అతని మొత్తం ఆస్తులమ్మినా 15 లక్షలు కూడా రావు : రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

అతని మొత్తం ఆస్తులమ్మినా 15 లక్షలు కూడా రావు : రేవంత్ రెడ్డి

March 3, 2022

22

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపాలని రూ. 15 కోట్ల ఒప్పందంతో కుట్ర చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే మంత్రి హత్యకు సుపారీ ఇచ్చినట్టుగా భావిస్తోన్న వ్యక్తి కి ఉన్న మొత్తం ఆస్తులమ్మినా 15 లక్షలు కూడా రావని తెలిపారు. ఈ మొత్తం ఘటనపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘ అధికార టీఆర్ఎస్ తెలంగాణను మరో బీహార్ గా మార్చాలని చూస్తోంది.

మంత్రిపై హత్యాయత్నం జరిగింది నిజమైతే ముఖ్యమంత్రి ఎందుకు రివ్యూ చేయలేదు? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బీహార్ అధికారులే లీడ్ చేస్తున్నారు. డీజీపీ అనారోగ్యంతో ఉంటే హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయడం లేదు? అడిషనల్ డీజీపీగా ఛార్జ్ తీసుకున్న అధికారి వద్ద ఎన్ని శాఖలున్నాయ’ని ప్రశ్నించారు. డీజీపీ ప్రకటన చూస్తే ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థమవుతోందన్నారు. జూనియర్ అధికారి అయినటువంటి సందీప్ సుల్తానియాకు ఎందుకు అన్ని శాఖలు ఇచ్చారని మండిపడ్డారు. ఒక్కో శాఖను ఒక అధికారికి కేటాయించాలనీ, సీఎస్ సోమేశ్ కుమార్ వద్దే చాలా శాఖలు ఉన్నాయని వివరించారు. ఐఏఎస్ అధికారులు సరిపడా లేరనే సాకుతో ఇంతకాలం నెట్టుకొచ్చినా.. ఇప్పుడు కేంద్రం ఐఏఎస్‌లను కేటాయించినా వారికి శాఖలను ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ టీఆర్ఎస్‌కు బానిసలుగా మారాయనీ, వారిలో చైతన్యం చచ్చిపోయిందని దెప్పిపొడిచారు.