అతని జోస్యం 14 ఏళ్లు ఆలస్యం.. కుంజీలాల్ ఇకలేడు! - MicTv.in - Telugu News
mictv telugu

అతని జోస్యం 14 ఏళ్లు ఆలస్యం.. కుంజీలాల్ ఇకలేడు!

October 27, 2019

His Astrology is 14 years late .. Kunjilal is no more!

2005లో తాను మరణిస్తానని తనపై తానే జోస్యం చెప్పుకున్న కుంజీలాల్(88) 14 ఏళ్ల తర్వాత మరణించాడు. అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన తన మాటను అబద్ధం చేస్తూ 14ఏళ్ల తర్వాత ఈ శనివారం మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అయితే కుంజీలాల్ జోస్యం నిజం కానందకు వారు ఎలాంటి జోకులు వేయడం లేదు.  మృత్యువు కుంజీలాల్ దరిచేరకపోవడానికి అతడి భర్య చేసిన పూజలే కారణమని వారు చెబుతున్నారు. కుంజీలాల్ వల్ల తమ గ్రామం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘నేను గత వారం కుంజీలాల్‌ను కలిశాను. తన ప్రాణం ఏ క్షణమైనా పోవచ్చని ఆయన నాతో చెప్పాడు. పాచికల సాయంతో అతడు భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పేవాడు. అతడి సలహాకోసం పేరు ప్రఖ్యాతులు ఉన్న వారెందరో మా గ్రామానికి వచ్చేవారు. కుంజీలాల్ అంటే మాకెంతో గౌరవం’ అని తెలిపాడు. 

2005 అక్టోబర్ 20న తాను చనిపోతానని కుంజీలాల్ జోస్యం చెప్పాడు. అప్పుడు అతను నివసించే మధ్యప్రదేశ్‌ బేతుల్ జిల్లా‌లోని నెహ్రా గ్రామం ఎంతో ఫేమస్ అయింది. ఆ రోజు రాష్ట్రంలోని టీవి చానళ్లన్నీ అతడి ఇంటి ముందు క్యూకట్టాయి. ప్రభుత్వ డాక్టర్లు కుంజీలాల్ ఇంటికొచ్చి రెప్పవేయకుండా అతడి ఆరోగ్యాన్ని గమనించారు. ఇంట్లో జరిగే ఘటనలన్నీ లైవ్‌లో చానళ్లు ప్రసారం చేశాయి. కానీ, ఆరోజు ఆయన మరణించలేదు. దీంతో అప్పుడు ఆయనను చాలామంది ఫేక్ జ్యోతిష్యుడు అని అన్నారు.