ఈ నెల 8న విడుదల అవుతున్న ‘ నైజాం సర్కరోడ ’ సినిమా మీద ప్రొడ్యూసర్ రాజమౌళికి భారీ అంచనాలున్నాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరాఠీలో నిర్మితమైన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. సిద్ధార్ధ్ జాదవ్, జ్యోతీ సుభాష్, శరద్ బుటాడియా శశాంక్ షిండే, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రధారులుగా రూపొందింది ఈ సినిమా. మరాఠీలో ‘ రజాకార్ ’ పేరిట విడుదలైంది. నైజాం, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అప్పటి పరిస్థితులను కళ్ళకు కడుతుంది. రాజ్ ధూర్జె దర్శకత్వం వహించాడు.
హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని మహరాష్ట్రలో స్థిరపడ్డ ఒక యోధుడి తనయుడే రాజ్ దుర్గే. 17 సెప్టెంబర్ 1948 కన్నా ముందు రజాకార్ల రాక్షస రాజ్యంలో జరిగిన అకృత్యాలు, దురాగతాలకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సినిమా. పూట గడవడం కోసం పోరాడే ఓ సామాన్య మనిషి చారిత్రాత్మక విముక్తి పోరాటంలో ఏవిధంగా భాగస్వామి కాగలిగాడనేది ఆసక్తికరంగా తెరకెక్కింది ఈ సినిమాలో. అప్పటి స్థితిగతులు, సంస్కృతి, భాష, పోరాటాల తీరును దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. తెలుగు వాళ్లు తీయాల్సిన మంచి కథా బలమున్న చిత్రమిది. నటుడు షఫీ ఈ సినిమాకు తన వాయిస్ ఓవర్ అందించడం విశేషంగా మారింది. కొన్ని వివాదాల అనంతరం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే ఈ సినిమాకు మినిమమ్ థియేటర్లు కూడా లభించకపోవడం అత్యంత బాధాకర విషయం.