హనీట్రాప్.. ద్రౌపది నుంచి నేటి పుల్వామా దాకా! - MicTv.in - Telugu News
mictv telugu

హనీట్రాప్.. ద్రౌపది నుంచి నేటి పుల్వామా దాకా!

May 17, 2019

అసలు విషయంలోకి వెళ్లేముందు ఒక పురుష బలహీనత గురించి రెండు ముక్కలు. ‘ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే’ అంటాడు త్యాగరాజు. శత్రువు బలాన్ని అంచనా వేయడం చాలా సులువు. సైన్యం, ఆయుధాలు అన్నీ పైకి కనిపించేవే. కనిపించకున్నా, వేగుల ద్వారా సమాచారం తెప్పించుకోవచ్చు. కానీ కనిపించని బలహీనతలను పసిగట్టడం చాలా కష్టం. వాటిని కనిపెట్టామా, యుద్ధంలో విజయం నల్లేరు మీద బండినడకే.

హనీ ట్రాప్ అలాంటిదే. కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న జైషే మహమ్మద్ ఉగ్రదాడి వెనక అలాంటిది ఉందని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ దర్యాప్తుతో తేలింది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో ఓ మాయలేడి అవినాశ్ కుమార్ అనే భారతీయ సైనికుణ్ని ముగ్గులోకి దింపి భారత సైనికుల కదిలికలను పసిగట్టింది. భారత జవాన్లు ‘తేనె ఉచ్చు’లో పడ్డం ఇదే తొలిసారేమీ కాదు. చాలామంది కేవలం కన్ని గంటల శృంగారం కోసం, వలపు మాటల కోసం దేశానికి ద్రోహం తలపెట్టారు. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉండే భారత జవాన్లను పాక్ నిఘా నెట్‌వర్కులు పసిగట్టి అమ్మాయిలను విసురుతున్నాయి. కొందరు కేవలం అమ్మాయిల కోసం, కొందరు అమ్మాయిలు ప్లస్ డబ్బు కోసం అత్యంత రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి అప్పనంగా ఇచ్చేస్తున్నారు. దీన్ని గుర్తించిన త్రివిధ దళాలు.. సోషల్ మీడియాకు సాధ్యమైనంతమేరకు దూరంగా ఉండాలని అడ్వైజరీలు జారీ చేస్తోంది. కానీ మానవ సహజాతాలు చట్టాలు, అడ్వైజరీలకంటే బలమైనవి కనుక ఫలితం లేకుండా పోతోంది.  

హనీ ట్రాప్‌ కళలు..

హనీట్రాప్.. మానవజాతి చరిత్ర అంతటి పురాతనమైనది. శత్రురాజులకు అమ్మాయిలను వలగా విసిరి దెబ్బకొట్టేవాళ్లు. బైబిల్‌లోని జుడిత్, హోలోఫెర్నెస్ కథ అలాంటిందే. దేశాన్ని కాపాడుకోడానికి శత్రురాజైన హోలోఫెర్నెస్ గుడారానికి వెళ్తుంది జుడిత్. వలపు మత్తులో ఉన్న అతణ్ని గొంతుకోసి తల తీసుకెళ్తుంది. మహాభారతంలోని విరాటపర్వంలోనూ హనీట్రాప్ కథ ఉంది. సింహబలుడు అలియాస్ కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామిస్తాడు. అతని పీడ వదిలించుకోడానికి ఆమె వంటవాడిగా పనిచేస్తున్న భీముణ్ని వేడుకుంటుంది. ముహూర్తం పెట్టి నర్తనశాలకు రమ్మంటుంది పీడకుణ్ని. తర్వాత ‘వలలుడు’ ఆడవేషం కట్టి, తర్వాత కీచకుణ్న హతమార్చడం  మనకు తెలిసిన కథే. ఇది స్వార్థం కోసం కాకుండా శత్రువును అంతమొందించడానికి, శీలరక్షణకు వేసిన హనీట్రాప్!

ఇప్పుడిలా..

ఈ పన్నాగం కేవలం సైన్యానికే పరిమితం కాదు. వ్యాపారం, టెక్నాలజీ, బ్యాంకులు వంటి రంగాల్లోనూ సాగుతోంది. రహస్యాలను తెలుసుకోవడమే ఏకైక లక్ష్యం. ఆపరేషన్ చేసే వ్యక్తులు అందమైన అమ్మాయిలను ఎంచుకుని వారికి ట్రైనింగ్ ఇస్తారు. అందంతోపాటు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, వీలైతే ప్రాణాలకు తెగించే ధైర్యం కూడా ఉండాలి. ముఖ్యంగా వంచించే నేర్పు తప్పనిసరి. తర్వాత పని మొదలవుతుంది. టార్గెట్‌ను కలుసుకుంటారు. ముఖాముఖిగా వీలు కాకపోతే ఫోన్లు, ఈమెయిల్స్, ఇతర కమ్యూనికేషన్లతో కాంట్రాక్టు అవుతారు. ముగ్గులోకి దించే అమ్మాయిలపైనా గట్టి నిఘా ఉంటుంది. సినిమాటిగ్గా ఆమె టార్గెట్‌ను నిజంగానే ప్రేమిస్తే మొత్తం ఆపరేషన్ వ్యర్థంగా మారుతుంది కనుక ఆమెపై కన్ను ఉంటుంది. అమ్మాయిలు టార్గెట్లకు తమపై బాగా నమ్మకం కలిగించడానికి కొంచెం బిడియంగానూ ప్రవర్తిస్తారు. తమను అతడు నమ్మాడని పూర్తిగా నిర్ధారించకున్న తర్వాత కావాలసిన సమాచారాన్ని కూపీ లాగుతారు. ‘అవసరమైతే’ హోటళ్లకు వెళ్తారు. కానీ ఎక్కడ ఏమాత్రం లీక్ అయినా ప్రాణాలకు ముప్పే.

మొత్తం ఆపరేషన్‌లో అమ్మాయి విశ్వసనీయత కీలకం. కొన్నిసార్లు టార్గెట్లు ‘తప్పుడు సమాచారం’ కూడా ఇచ్చే అవకాశముంది. ఆ సమాచారంతో ఆర్మీ ఆపరేషన్లు చేపడితే అసలుకే ఎసరు. అందుకే విశ్వసనీయతకు పెద్దపీట వేస్తారు. ఆపరేషన్ చేపట్టే అధికారులు వీలైతే తమ భార్యలను, కూతుళ్లను, అక్కచెల్లెళ్లను కూడా రంగంలోకి దింపుతుంటారు. హానీట్రాప్ పైకి కనిపించేంత రొమాంటిక్ వ్యవహారం కాదు.  

మాతాహరి, టిప్పు వారసురాలు..

హనీట్రాప్ అంటే చాలామందికి చప్పున గుర్తుకొచ్చే పేరు మాతాహరి. డచ్ కేబరేల్లో డ్యాన్స్ చేసిన మాతాహరి మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అందాలను ఎరవేసి ప్రాణనష్టానికి తనవంతు సాయం చేసింది. జర్మనీ తరఫున గూఢచర్యం చేసిన ఆమెను తర్వాత కాల్చిచంపేశారు. టిప్పు సుల్తాన్ వంశంలో పుట్టిందని చెప్పుకునే షబానా ఖాన్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో గూఢచర్యం చేసింది. అరెస్టయి జైల్లో పడింది. 1944లో ఆమెను నాజీలు కాల్చిచంపారు.