ఫ్రెండ్లీ సీఎంల మధ్య చిచ్చురేపిన పోతిరెడ్డిపాడు పుట్టుపూర్వోత్తరాలు..
తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మొదలైందా? అని అడిగితే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటరీ కెపాసిటీని పెంచాలని, శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటిని తరలించడం కోసం జగన్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. అలాగే ‘రాయలసీమ పంపింగ్ ప్రాజెక్ట్’ పేరుతో శ్రీశైలం నుంచి రాయసీమకు నీటిని తరలించడం కోసం రూ.6,829 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం మే 5న జీవో నెం.203 జారీ చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం కోసం జగన్ సర్కారు జీవో జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
గత డిసెంబర్ లోనే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కృష్ణా బోర్డు స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు విషయంలో బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అయితే బోర్డు సూచనలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ విస్తరణకు సన్నద్ధం కావడం గమనార్హం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద జలాలను, చెన్నైకి ఇవ్వాల్సిన 15 టీఎంసీల తాగునీటిని జలాశయం నుంచి పారించే ఉద్దేశంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలో పోతిరెడ్డిపాడు గ్రామంలో హెడ్ రెగ్యులేటరీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా కడప, కర్నూలు జిల్లాలకు, తెలుగు గంగ కాలువకు, గాలేరు-నగరి వరద జలాల మళ్లింపు కాలువకు శ్రీశైలం జలాలను మళ్లిస్తారు.
శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. కాగా 854 అడుగుల వరకు నీటి లభ్యత ఉన్నప్పుడు శ్రీశైలం వెనుక జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే అవకాశం ఉందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే శ్రీశైలం నీటి మట్టం 800 అడుగులకు తగ్గినా సరే రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఏపీకి మళ్లించే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే శ్రీశైలంపై ఆధారపడ్డ నాగార్జున సాగర్, మిగతా తెలంగాణ ప్రాజెక్టులకు నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం నిండిన తర్వాతే నాగార్జున సాగర్ డ్యామ్‌కు నీటిని వదులుతారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి దాని ద్వారా నీటిని రాయలసీమకు మళ్లిస్తుంటే.. దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కృష్ణా జలాల పంపిణీ ప్రకారం రాష్ట్రం వాటా రూపంలో వచ్చే నీటినే వాడుకుంటున్నామని.. ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని, రాజకీయం చేయడం సమంజసం కాదని జగన్ కోరుతున్నారు.