Home > Analysis > అలెగ్జాండర్‌ను ఓడించిన భారతీయుడు.. చరిత్రలో లేని పచ్చి నిజం

అలెగ్జాండర్‌ను ఓడించిన భారతీయుడు.. చరిత్రలో లేని పచ్చి నిజం

సింహాలు తమ చరిత్రను తాము రాసుకునేవరకు వేటగాళ్లు రాసిందే చరిత్రగా చలామణి అవుతది. అందుకే కావొచ్చు ప్రపంచాన్ని గెలుద్దామనుకున్న అలెగ్జాండర్ వీరత్వాన్ని ఓడించిన భారతీయ రాజు పురుషోత్తముడి పౌరుషం చరిత్రకెక్కలేదు. ఎదురేలేదనుకున్న గ్రీకువీరుడి కత్తిని ముక్కలు చేసిన మూలవాసీ పురుషోత్తముడి తెగింపును ఆధిపత్యపు భావజాలమేదో చీకట్లో కలిపింది. అయితే నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేరు.

క్రీస్తుపూర్వం 331లో జరిగిన అల్బెలా యుద్ధంలో పర్షియన్లను ఓడించినంక నాటి ప్రపంచంలో విశాల రాజ్యానికి అలెగ్జాండర్ చక్రవర్తి అయిండు. గ్రీస్, ఈజిప్ట్, ఇరాన్, టర్కీ, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు రాజ్యాన్ని విస్తరించిండు. అయినా సరే గ్రీకు వీరుడికి సంతృప్తి కలగలేదు. సింధు నదికి అవతల ఉన్న విశాల భూభాగాన్ని కూడా జయించాలనుకున్నడు. అయితే అదంత సులభం కాదని పర్షియన్లు అలెగ్జాండర్‌ను హెచ్చరించిన్రు. ఇండియాను గెలవాలని భారీ సైనిక బలగంతో పోయిన తమ రాజు మూడో సైరస్ చిత్తుగా ఓడిపోయిన సంగతిని గుర్తుచేసిన్రు. ఆ మాట విన్నంక అలెగ్జాండర్‌లో మరింత పట్టుదల పెరిగింది. ఎట్లైనా ఇండియాను ఓడించి కొత్త చరిత్ర సృష్టించాలనుకున్నడు.

అప్పట్లో ఇండియా ఎలా ఉండేదంటే….

Image result for bc 331 indian map

అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జి, అవంతి, కాంభోజ, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక, గాంధార,మల్ల, చేది, వత్స అనే 16 మహాజనపద రాజ్యాల సమూహంగా ఇండియా ఉండేది. ఈ రాజ్యాలన్నింటిని ఓడిస్తేనే ఇండియాను గెలిచినట్టు అని పర్షియన్లు అలెగ్జాండర్‌కు చెప్పిన్రు. దీంతో తన దగ్గరున్న 40వేల మంది సైనికులు, ఆరువేల అశ్వికాదళానికి తోడుగా మరో 20 వేల సైన్యాన్ని తెచ్చుకున్న అలెగ్జాండర్… ఇండియా సరిహద్దుల వైపు సమరోత్సాహంతో కదిలిండు.

తొలి గెలుపు

Image result for alexander at sindu in india

పెద్దగా ప్రతిఘటన లేకుండానే సింధు నదికి పశ్చిమాన ఉన్న పుష్కరావతి నగరాన్ని గ్రీకులు గెలచుకున్నరు. పక్కనే ఉన్న గాంధార జనపదం దిక్కు కదిలిన్రు. ఆ రోజుల్లో ఆ జనపదాన్ని అంభీ పాలించేవాడు. అలెగ్జాండర్ కంటే అంభీ దగ్గరే ఎక్కువ సైన్యం ఉండేది. శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసే యుద్ధ వ్యూహాలు పన్నడం అంభికి ఎడమచేతి పని. కాని ఆ రోజు అంభి మరోలా ఆలోచించిండు. తక్షశిలకు చేరుకున్న అలెగ్జాండర్‌తో అంభి తలపడాలనుకోలేదు. అలెగ్జాండర్ దగ్గరకు తన రాయబారిని పంపిండు. గ్రీకు రాజ్యానికి సామంతుడిలా ఉండడానికి తనకు అభ్యంతరం లేదన్నడు. ఆ మాట విన్న అలెగ్జాండర్ ఆశ్చర్యపోయిండు. ఒక్క చుక్క రక్తం చిందకుండానే గాంధార లాంటి పెద్ద రాజ్యం తన సొంతం అయినందుకు సంతోషపడిండు. ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోవాలని అంభిని కోరిండు. తన మనసులో మాట చెప్పిండు అంభి.

మాట వెనుక మర్మం

Image result for alexander and ambi

పారువ రాజు పురుషోత్తముడితో ఉన్న ఆగర్భ శతృత్వమే అలెగ్జాండర్‌తో అంభి చేతులు కలపడానికి కారణం. తనకంటే బలవంతుడైన పురుషోత్తముడిని ఓడించడం అంభికి సాధ్యం కాలేదు.. అందుకే గ్రీకుల సాయంతో పురుషోత్తముడిని గెలిచి అతని రాజ్యాన్ని పొందాలనుకున్నడు.. పురుషోత్తముడిని ఓడించి అతని రాజ్యాన్ని కానుకగా ఇస్తానని అంభికి అలెగ్జాండర్ మాట కూడా ఇచ్చిండు.. అయితే పురుషోత్తముడి అసమాన ధైర్యసాహసాలు, అనితర సాధ్యమైన వ్యూహాల ముందు గ్రీకు ఆర్మీ కండబలం, బుద్ధి బలం సరిపోవనుకున్నడు అంభి. అందుకే కొంత సైన్యాన్ని ఇవ్వడంతో పాటు పురుషోత్తముడి బలం, బలహీనతల గురించి చెప్పిండు..

క్రీస్తు పూర్వం 326 ఏప్రిల్…జీలం నది ఒడ్డున

Related image

అంభి అండగా నిలవడంతో ఇక గెలుపు సులభమనుకున్నడు అలెగ్జాండర్.. తన పేరు చెపితేనే పురుషోత్తముడు భయపడతాడనుకుని రాయబారిని పంపిండు. సంధికి ఒప్పుకుంటే సామంతుడిగా ఉండనిస్తనన్నడు. ఆ మాట విన్న పురుషోత్తముడి రక్తం కుతకుతలాడింది. ఆత్మగౌరవం కోసం యుద్ధానికి సిద్ధమన్నడు. కదన రంగంలో తన కత్తి చివర అలెగ్జాండర్ తల ఉన్నప్పుడు మాత్రమే సంధి గురించి మాట్లాడతానన్నడు.

జీలం నది ఒడ్డున మొహరించిన గ్రీకు ఫౌజును చూసి పురుషోత్తముడు భయపడతాడనుకున్నడు అలెగ్జాండర్. కాని పురుషోత్తముడి రక్తంలోనే యుద్ధం ఉంది.. భయాన్ని శత్రువు కళ్లలో మాత్రమే చూసిన ధీరత్వం అతడిది. పురుషోత్తముడు అదరలేదు..బెదరలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీకులు నది దాటొద్దనుకున్నడు. నదికి ఇవతల సైన్యంతో కాపుకాసిండు.

పురుషోత్తముడి సైన్యం కళ్లుకప్పి ఎలాగైనా జీలం నదిని దాటాలనుంది గ్రీకు సైన్యం. ఓ ప్లాన్ వేసింది.. జీలం నదికి పది కిలోమీటర్ల పొడవునా గ్రీకు సైనికులు గుడారాలు వేసుకున్నరు..ప్రతీ రోజు రాత్రి కాగడాలు పట్టుకుని నదిని దాటినట్టు చేసి వెనక్కి వచ్చేది. ఇలా నెల రోజులు చేసిన్రు. దీన్ని చూసిన పురుషోత్తముడి సైనికులు నదిని దాటేందుకు గ్రీకు సైన్యం భయపడుతుందని అనుకున్నరు. కాని అక్కడ జరిగింది వేరు.. నదిని దాటడానికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో తెల్సుకునేందుకు గ్రీకు సైన్యం అట్ల చేసింది. .

క్రీస్తు పూర్వం 326 మే 2.. రెండు కొదమసింహాలు ప్రశాంతంగా జీలం నదీ తీరంలో కాపు కాసినయ్. ఆ ప్రశాంతతను చెదరగొడుతూ వర్షం విరుచుకుపడింది..అప్పుడే అలెగ్జాండర్ మెరుపులా ఆలోచించిండు. వర్షాన్ని, చీకటిని అడ్డం పెట్టుకుని పదివేల కాల్బలం సైనికులు, ఆరువేల అశ్వికదళం, గుర్రాలపై నుంచి బాణాలు వేసే వెయ్యి మంది విలుకాళ్లతో జీలం నదిని దాటించిండు.

అలెగ్జాండర్ ఆర్మీ నది దాటిన విషయం తెలుసుకున్న పురుషోత్తముడు కొద్దిసేపు గందరగోళానికి గురయిండు. ఎందుకంటే అతడి కళ్ల ముందు నది అవతల ఇంకా వేల సంఖ్యలో గ్రీకు సైనికులు మొహరించే ఉన్నరు.. కాని గూఢచారులేమో గ్రీకు సైన్యం నది దాటిందని చెప్పిన్రు. ఒకవేళ నది దాటిన గ్రీకు సైన్యాన్ని ఎదుర్కోవడానికి తాను అక్కడి నుంచి పోతే అవతలున్న సైన్యం సులువుగా తీరం దాటుతుందనుకున్నడు.. ఇంతేకాదు అలెగ్జాండర్ ఏ సైనిక పటాలంతో ఉన్నడో తెలియదు.. అందుకే తాను అక్కడే ఉండాలనుకున్నడు.. నది దాటిన గ్రీకు సైన్యం సంఖ్యా బలంపై కూడా పురుషోత్తముడికి అంచనా లేదు.. గ్రీకులను ఎదుర్కోవడానికి కొడుకు పురుషోత్తమ్ నాయకత్వంలో పరిమిత సంఖ్యలో సైన్యాన్ని పంపిండు.

చరిత్రలో ఉన్నదాని ప్రకారం యుద్ధం ఎలా జరిగిందంటే?

Image result for 326 April on the banks of the Jhelum River

క్రీస్తు పూర్వం 326 మే 3 న హెడాస్పస్ యుద్ధం మొదలైంది.. రెండు వేల అశ్వికాదళం, రెండు వందల రథాలతో పదిహేడు వేల గ్రీకు సైనికులను ఎదుర్కోవడానికి పురుషోత్తముడి సైన్యం సిద్దమైంది.. తమవైపు దూసుకొస్తున్న పురుషోత్తముడి సైన్యాన్ని అడ్డుకునేందుకు పర్షియన్ విలుకాళ్లను ముందుంచిండు అలెగ్జాండర్.. జింక ఎముకతో చేసిన తేలికైన విల్లుతో గుర్రాలపై నుంచి మెరుపు వేగంతో బాణాలు వేసే పర్షియన్లు గ్రీకు ఆర్మీకి అదనపు బలం.. వెయ్యి మంది పర్షియన్ విలుకాళ్లు కురిపించిన బాణాలతో పురుషోత్తముడి సైన్యం గందరగోళానికి గురైంది.. అందరూ ఒక్కదగ్గరకు చేరిన్రు. ముందు రాత్రి వర్షం పడడంతో రథాలన్నీ బురదలో దిగబడ్డయ్. గ్రీకు ఆర్మీపై విరుచుకుపడాలనుకున్న పురుషోత్తముడి సైన్యం పథకం విఫలమయింది. గుంపుగా ఒక్క దగ్గరకు చేరి పురుషోత్తముడి సైన్యం తప్పు చేసింది. అప్పుడే ఆరువేల గ్రీకు అశ్వదళం పురుషోత్తముడి బలగాలపై విరుచుకుపడి ఊచకోత కోసింది..ఆ మారణహోమంలో పురుషోత్తముడి కుమారుడు పురుషోత్తమ్ కూడా చనిపోయిండు.

విషయం తెలుసుకున్న పురుషోత్తముడు యుద్ధం మొదలుపెట్టిండు. విశాలంగా ఉన్న ఓ ప్రాంతంలో తన సైన్యాన్ని మొహరించి గ్రీకు ఆర్మీ కోసం ఎదురుచూసిండు.. యుద్ధం కోసం విశాల ప్రదేశాన్ని ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయి.. తన దగ్గరున్న రథాలు ఫ్రీగా కదలడం ఒకటైతే గజదళం రెండోది. పురుషోత్తముడి సైన్యంలోని ఏనుగులు యుద్ధంరంగంలో వీరవిహారం చేయాలంటే వాటికి తగినంత స్థలం కావాలి.. అందుకే పురుషోత్తముడు విశాల ప్రాంతాన్ని ఎంచుకున్నడు.. 30 వేల మంది విలుకాళ్లు, నాలుగువేల అశ్వదళం, వెయ్యి రథాలు వాటిపై నుంచి బాణాలు వేసేందుకు ఇద్దరు విలుకాళ్లతో పాటు దాదాపు నలభై వేల సైనికులతో పురుషోత్తముడు యుద్ధరంగంలో సింహంలా నిలుచున్నడు.

Related image

అలెగ్జాండర్‌తో పదిహేడు వేల సైన్యం మాత్రమే ఉంది.. మిగతా నలభై ఐదు వేల సైనికులు జీలం నదికి అవతలనే ఉన్నరు. వాళ్లను తీసుకురావాలని అలెగ్జాండర్ ఓ మనిషిని పంపిండు. తమ ముందు కనిపిస్తున్న భారీ సైన్యాన్ని చూసి గ్రీకు సైనికులు వణికిపోయిన్రు. ఏనుగులు వాళ్లను తీవ్రంగా భయపెట్టినయ్. గ్రీకు సైన్యం ఇంకా సమరానికి సిద్ధంకాకపోవడంతో పురుషోత్తముడు యుద్ధనీతిని పాటించిండు. ఒకవేళ అప్పుడే యుద్ధం మొదలుపెట్టి ఉంటే గ్రీకు సైన్యం దారుణంగా దెబ్బతినేది.. పురుషోత్తముడి వ్యక్తిత్వాన్ని చూసి అలెగ్జాండర్ ముచ్చటపడ్డడు. రెండు గంటల తరువాత నలభై వేల గ్రీకు సైనికులు అలెగ్జాండర్‌తో కలిసిన్రు.

ఏడు అడుగుల నాలుగు అంగుళాల ఆజానుబాహుడైన పురుషోత్తముడి కళ్లలో కనిపించిన కసిని చూసి అలెగ్జాండర్ ముచ్చటపడ్డడు. . పురుషోత్తముడి వీరత్వం గురించి అంభి చెప్పింది నిజమే అనుకున్నడు.. అయినా గెలుపు తనదే అనుకున్నడు. తొలిదాడి తనే చేసిండు. తనదైన యుద్ధ వ్యూహాలతో పురుషోత్తముడి సైన్యాన్ని చావుదెబ్బ తీసిండు. సాయంత్రం అయ్యేసరికి పురుషోత్తముడి సగం సైన్యం తుడిచిపెట్టుకపోయింది..కానీ పురుషోత్తముడితో పాటు అతని సైనికులు ఎవరూ వెనక్కి తగ్గలేదు.. పురుషోత్తముడైతే రణరంగంలో బెబ్బులిలా విజృంభించిండు…రక్తం కారుతున్నా కత్తివదల్లేదు..గ్రీకు సైనికులను ఊచకోత కోసిండు.

ఓడిపోయే పరిస్థితిలోనూ పురుషోత్తముడు యుద్ధరంగాన్ని వదలకుండా పోరాడడం అలెగ్జాండర్‌కు బాగా నచ్చింది. అందుకే యుద్ధాన్ని ఆపేసి పురుషోత్తముడి దగ్గరకు దూతను పంపిండు. తనను కలవాలని కబురు పంపిండు. అలెగ్జాండర్ ను కలవడానికి పురుషోత్తముడు ఒప్పుకున్నడు.

యుద్ధ రంగంలో ఉన్న గ్రీకు చరిత్రకారుడు ఆరియన్ రాసిన దాని ప్రకారం ఆ రోజు ముందు అలెగ్జాండరే మాట్లాడిండు. ఎలా గౌరవించాలో చెప్పాలని పురుషోత్తముడిని అడిగిండు. ఒక రాజును ఇంకో రాజు ఎలా గౌరవిస్తాడో అలా గౌరవించాలని పురుషోత్తముడు చెప్పిండు. ఆ తెగింపు అలెగ్జాండర్ కు నచ్చింది. గ్రీకు రాజ్య ప్రతినిధిగా ఉండడానికి పురుషోత్తముడు కూడా ఒప్పుకున్నడని ఆరియన్ రాసిండు.

ఇదంతా నిజమేనా?

Related image

గెలవడానికి ఎంతకైనా తెగించే వ్యక్తిత్వం అలెగ్జాండర్‌ది. తన ఆధిపత్యాన్ని అంగీకరించని శతృవును సమూలంగా నాశనం చేసేదాక కత్తి దించడు. ఇందుకు పర్షియన్ రాజు డేరియసే సాక్ష్యం. గాల్గమెలా యుద్ధంలో ఓడిపోయి పారిపోయిన డేరియస్ కోసం అలెగ్జాండర్ మూడు నెలలు వెతికిండు. అలాంటి యుద్ధపిపాసి… ఓడిపోయిన పురుషోత్తముడిని గౌరవించాడంటే కొంతమంది చరిత్రకారులు నమ్మలేదు.

ఇక పురుషోత్తముడిని ఓడించి అతని రాజ్యాన్ని కానుకగా ఇస్తానని అంభికి అలెగ్జాండర్ మాటిచ్చిండు..అందుకు ప్రతిఫలంగా అతడి సైన్యాన్ని యుద్ధంలో వాడుకున్నడు. విశ్వవిజేతగా తనను తాను ఊహించుకునే అలెగ్జాండర్ అంభికిచ్చిన మాట తప్పుతడా? ఓడిపోయిన పురుషోత్తముడికి రాజ్యాన్నిచ్చి అతడి శత్రువు అంభిని ఎలా సంతృప్తి పరిచిండో గ్రీకు చరిత్రకారులు రాయలేదు. అలాగే ఏ ఆత్మగౌరవం కోసం ప్రాణాలకు తెగించి పురుషోత్తముడు పోరాడిండో దాన్ని పక్కనపెట్టి గ్రీకు రాజ్యానికి ప్రతినిధిగా ఉండడానికి ఎలా ఒప్పుకున్నాడో ఎవరూ చెప్పలేదు.

కొత్త చరిత్ర/ అసలు నిజం

హెడాస్పస్ యుద్ధంలో గ్రీకు ఆర్మీని, పురుషోత్తముడి సైన్యం చిత్తుగా ఓడించిందని మాజీ రష్యా సైనికాధికారి, మార్షల్ జార్జ్ జుకావ్ తో పాటు ఎంతో మంది చరిత్రకారులు నమ్ముతున్నరు.. వారి వాదన ప్రకారం అలెగ్జాండర్ ఆర్మీ జీలం నది దాటిందని తెలుసుకున్న పురుషోత్తముడు.. దట్టమైన అడవిలో తనకు అనువుగా ఉన్న ప్రదేశంలో మాటువేసిండు. గ్రీకు ఆర్మీ రావడానికి ముందే ఆ ప్రాంతంలోని చెట్లపై వేలాది మంది విలుకాళ్లను మోహరించిండు.. గ్రీకు సైన్యాన్ని నాలుగు దిక్కుల నుంచి పురుషోత్తముడి సైన్యం చుట్టుముట్టింది..ఏనుగుల అరుపులు,సైనికుల నినాదాలతో గ్రీకులు ఆగం ఆగం అయిన్రు. అదును చూసుకుని పురుషోత్తముడి సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది.

Image result for purishothamudu alexjandar

పురుషోత్తముడి సైన్యంలో గజబలం గ్రీకులను దారుణంగా దెబ్బతీసింది…తమకు మాత్రమే సొంతమైన 21 అడుగుల ఈటెలతో ఏనుగులను ఎదుర్కోవాలనకున్న గ్రీకుల పథకం బెడిసికొట్టింది.. ఏనుగుల పైన ఉన్న నలుగురు పురుషోత్తముడి సైనికులు అక్కడి నుంచి ప్రయోగించిన బాణాలు, బరిసెలతో చాలా మంది గ్రీకు సైనికులు చనిపోయిన్రు. మిగిలిన వారిని ఏనుగులు తొక్కి చంపేసినయ్. ఇక గ్రీకు సైన్యంలోని అశ్వికదళాన్ని చెట్లపై నుంచి వచ్చిన వేలాది బాణాలు దారుణంగా దెబ్బతీసినయ్.

పర్షియన్ యుద్ధాల్లో అనుసరించిన యుద్ద వ్యూహాన్నే హెడాస్పస్ యుద్ధంలోనూ అలెగ్జాండర్ అనుసరించిన్రు.

దాని ప్రకారం ఒంటరిగా ఉన్న పురుషోత్తముడి దగ్గరకు పోయి దాడి చేయాలనుకున్నాడు… ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతున్న అలెగ్జాండర్ ను ఓ బాణం గాయపరిచింది.. కిందపడ్డ అలెగ్జాండర్‌ను పురుషోత్తముడి సైన్యం చుట్టుముట్టింది.. అతడి గుర్రాన్ని చంపేసింది.. గ్రీకు సైనికులు రావడం క్షణం ఆలస్యమైనా అలెగ్జాండర్ చనిపోయేవాడు.. గ్రీకు కమాండర్లు అలెగ్జాండర్‌ను అక్కడి నుంచి తప్పించిన్రు.

అలెగ్జాండర్ గాయపడి యుద్ధరంగాన్ని వదిలిండని తెలుసుకున్న పురుషోత్తముడు యుద్ధనియమాలను పాటించిండు. శత్రుఃరాజు లేకుండా యుద్ధం కొనసాగించడం అనైతికమనుకున్నడు.. అందుకే తను గెలిచే అవకాశం ఉన్నా సమరాన్ని మధ్యలోనే ఆపేసిండు. అలెగ్జాండర్ కోలుకున్నాక తిరిగి యుద్ధం మొదలుపెడదామని గ్రీకులకు చెప్పిండు. దీంతో గ్రీకులు వెళ్లిపోయారని కొంతమంది చరిత్రకారులు నమ్ముతున్నరు.

అలెగ్జాండర్ ను అల్లాడించిన ఇనుము

Related image

హెడాస్పస్ యుద్ధంలో అలెగ్జాండర్ ఆర్మీని ఇనుమే ఓడించింది. ఆ రోజుల్లో ఒక్క ఇండియాలోనే బలమైన ఇనుము దొరికేది.. దాంతోనే మనదేశంలోని సైన్యాలు విల్లు, బాణాలు, కత్తులు, డాళ్లు తయారు చేసుకునేవి.. గ్రీకుల దగ్గర మాత్రం బలహీనంగా ఉండే స్పాంజ్ ఐరన్, కర్రలతో తయారైన ఆయుధాలుండేవి. ఐదడుగుల ఇనుప విల్లుతో పురుషోత్తముడి సైన్యం ప్రయోగించిన బాణాలు గ్రీకుల కవచాలను తుక్కుతుక్కు చేసినయ్. చాలామంది గ్రీకు సైనికులు చనిపోయిన్రు. ఫలితంగా సగం ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ పురుషోత్తముడి ముందు నిస్సహాయంగా ఓడిపోయిండు. ఇది అసలు చరిత్ర. మనకు తెలియని చరిత్ర. మనం తెలుసుకోవాల్సిన చరిత్ర.

Related image

ఇండియాను గ్రీకులు గెలవడకుండా అడ్డుకున్న ఒకే ఒక్కడు పురుషోత్తముడు. ఆ రోజు అతడు రొమ్ము విరుచుకుని గ్రీకులకు ఎదురు నిలవకపోతే ఇప్పుడు మన చరిత్ర మరోలా ఉండేదేమో? శత్రువు ముందు తలవంచని ఆత్మాభిమానంతో పురుషోత్తముడు ఆ రోజు కత్తిపట్టకపోతే ఇండియా ఇలా ఉండకపోయేదేమో?

Updated : 20 Feb 2019 6:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top