hit 2 movie house not in vizag its in hyderabad govardhan farm
mictv telugu

హీరో ఇల్లు వైజాగ్ లో కాదు.. హైదరాబాద్ లోనే ఉంది!

January 6, 2023


ఓటీటీలో హిట్ 2 వచ్చింది చూశారా? ఈ సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగినట్లు చూపించారు. కానీ హీరో ఇల్లు మాత్రం హైదరాబాద్ లోని గోవర్ధన్ ఫామ్. అవును.. ఈ ఫామ్ ఒక ప్రత్యేకత కూడా ఉంది. పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లిపోండి..
హిట్ 2 సినిమా హిట్టా? ఫట్టా పక్కన పెడితే ఇప్పుడు హీరో ఇంటి గురించే ఈ స్టోరీ. హీరో, హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలు.. హీరో ఇంటికి సంబంధించినవి, చివరకి పెండ్లి జరిగిన ప్రాంతం కూడా గిర్మాపూర్ దగ్గర గోవర్ధన్ ఫామ్ లో. అవును.. మీరు విన్నది నిజం. అడవి శేషు ఉన్న ఇల్లు మొత్తం షూట్ చేసింది మన హైదరాబాద్ లోనే. అది కూడా ఒక అందమైన కలల భవంతిలో. ఆ ఇంటి గురించి తెలుసుకోవడమే కాదు.. దాన్ని అందాల భవంతిగా నిర్మించుకున్న ప్రదీప్ మోచెర్ల, రైతా మోచెర్ల గురించి తెలుసుకోవాలి. అక్కడ పండుతున్న ఆర్గానిక్ పంటల పై కూడా ఒక లుక్కేయాల్సిందే!

గోవర్ధన్ ఫామ్..
2009లో ఫిన్ ల్యాండ్ కి చెందిన రైతా, హైదరాబాద్ కి చెందిన ప్రదీప్ ల ప్రేమ భవంతిగా వెలిసింది. రైతా స్వతాహాగా నేచర్ లవర్. ఫిన్ ల్యాండ్ లో వేసవి కాలం అయితే అడవుల్లోకి వెళ్లేవారు. చిన్నప్పటి నుంచి ఆ వాతావరణాన్ని ఇష్టపడేది. ప్రదీప్ తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడి, పెండ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చింది. ఈ వేడికి ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో తమ కలల భవంతిని నిర్మించుకోవాలని గోవర్ధన్ ఫామ్ ని మొదలు పెట్టారు. అలా గిర్మాపూర్ గ్రామంలో కొద్ది స్థలంలో ఇల్లు కట్టారు. అయితే ఈ ఇంటికి ఎటువంటి ఉక్కు, కాంక్రీటు వాడలేదు. పైగా తంజావూరులోని పాడుబడిన దేవాలయాల నుంచి స్తంభాలను కూడా తెచ్చుకున్నారు. పెద్ద పెద్ద వరండాలతో ప్రయోగాత్మకంగా ఈ ఇంటిని నిర్మించారు. ఇటుకలు, రాళ్లు, టెర్రకోట టైల్స్, కలపతో.. ఇల్లు పురాతన కోటలా కనిపిస్తుంది. పైగా ఈ ఇంటికి ఏసీ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంటి బయట ఒక చిన్న షెడ్డులో ఆక్వాట్రాన్ ఏర్పాటు చేయబడింది. దీనిద్వారా మానవ వ్యర్థాల నుంచి ప్రమాదకరమైన వాయువులను వేరు చేస్తుంది.

ఆర్గానిక్ వ్యవసాయం..
ఈ జంట కేవలం ఇంటితో ఆపలేదు. మరికొన్ని ఎకరాలు తీసుకొని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. రెండు రకాల వ్యవసాయాల్ని చేస్తున్నారు. వేసవి, శీతాకాల వ్యవసాయం. ఉగాది తర్వాత ఒక పంట, దసరా తర్వాత ఒక పంట వేస్తుంటారు. ఎలాంటి మెషీన్స్ వాడకుండా భూమిని రెడీ చేస్తారు. ఇక్రిసాట్ నుంచి విత్తనాలు తీసుకొస్తారు. కొందరు రైతుల నుంచి కూడా విత్తనాలను సేకరిస్తారు. అంతేకాదు.. జీవామృతం, వెల్లుల్లి స్ప్రేల సమ్మేళనాలను వాడుతారు. అంతేకాదు.. కొన్ని పంటల పురుగులు వేరే పంటకు మేత. అందుకే అలా కలిసి పండించే వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇవి కాకుండా కోళ్లు, మేకలు, ఆవులు, గేదెలను కూడా పెంచుతున్నారు. వాటి పెంటనే ఎరువుగా ఉపయోగిస్తున్నారు. అలా ఒక సంవత్సరకాలంలో 30కి పైగా వెరైటీలను పండిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే girmapurorganics.com క్లిక్ చేయండి.