రేపట్నుంచే హైటెక్‌ సిటీ - రాయదుర్గం మెట్రో   - MicTv.in - Telugu News
mictv telugu

రేపట్నుంచే హైటెక్‌ సిటీ – రాయదుర్గం మెట్రో  

November 28, 2019

Hitec city-Raidurg stretch of Hyderabad metro to open tommorow

హైదరాబాద్‌ మెట్రో రైలు ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాక హైదరాబాద్‌ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజురోజుకూ మెట్రోరైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. మెట్రో రైలు ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో రూట్‌లో హైటెక్‌సిటీ- రాయదుర్గం మధ్య సర్వీస్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌ నుంచి ఉదయం 10.15గంటలకు జెండా ఊపి దీనిని ప్రారంభిస్తారు.  అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హెచ్‌ఎంఆర్‌ (హైదరాబాద్‌ మెట్రోరైల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

ఇదిలావుండగా పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ (పిపిపి) పద్దతిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మన హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు సాధించింది. దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ (56 కి.మీ.) కలిగి ఉన్న ప్రాజెక్టుగా కూడా హైదరాబాద్‌ మెట్రో పేరు సంపాదించుకుంది. రోజుకు 4లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రోజుకు 18వేల కి.మీ.ల ప్రయాణంలో 780 ట్రిప్పులు చేస్తోంది. గత రెండు సంవత్సరాల కాలంలో 12.5 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారు. రెండేళ్లలో 4.1లక్షల ట్రిప్పులతో 86 లక్షల కి.మీ. ప్రయాణించిన ఘనతను మెట్రో దక్కించుకుంది.