సీనీఫక్కీలో నైకూ ఎన్‌కౌంటర్..ఉగ్రవాదిగా మారినప్పుడే చచ్చాడన్న తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

సీనీఫక్కీలో నైకూ ఎన్‌కౌంటర్..ఉగ్రవాదిగా మారినప్పుడే చచ్చాడన్న తండ్రి

May 6, 2020

Hizbul Mujahideen Chief Riyaz Naikoo, Most Wanted, In Jammu And Kashmir

హంద్వారా ఎన్‌కౌంటర్ పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. హంద్వారా ఎన్‌కౌంటర్‌లో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్ తో సహా పలువురు భద్రతా సిబ్బంది అమరులైన విషయం తెల్సిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల్లోనే భారత సైన్యం.. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూతో సహా నలుగురు 

ఉగ్రవాదులను హతమార్చింది. మరొక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది.నైకూ తన తల్లిని కలిసేందుకు సొంతూరు బేగ్‌పొరాకు వస్తున్నట్లు నిన్న భద్రతా దళాలకు  సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటిన్నర కిలోమీటర్‌ వరకూ నైకూ గ్రామాన్ని చుట్టుముట్టారు. ఉదయం 9 గంటలకు రియాజ్ దాక్కున్న ఇంటిని పేల్చివేశారు. అక్కడ నుంచి తృటిలో తప్పించుకున్న రియాజ్ మరో ఇంట్లోకి దూరాడు. ఆ ఇంట్లో అప్పటికే ఉన్న సైన్యం నైకూను హతమార్చింది. నైకూను సైన్యం రెండేళ్లుగా ట్రాక్ చేస్తోంది.

నైకూ ఉగ్రవాదిగా మారక ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. అతన్ని ఇంజనీర్‌గా చూడాలని ఆయన తండ్రి కలలుకన్నారు. కానీ, నైకూ ఉగ్రవాదిగా మారాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడి తండ్రి తన కొడుకు తన దృష్టిలో చనిపోయాడని ప్రకటించాడు. 2012లో 33 ఏళ్ల వయసులో నైకూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో కమాండర్‌గా చేరాడు. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా సైన్యం మక్మూల్ భట్, బుర్హాన్ వనీ, జకీర్ మూసాలాంటి టాప్ కమాండర్లను హతమార్చింది. దీంతో కశ్మీర్ లోయలో రియాజ్ కీలకంగా మారాడు. రంజాన్ సందర్భంగా కూడా సైన్యంపై పెద్దఎత్తున విరుచుకుపడాలని తోటి ఉగ్రవాదులకు పిలుపునిచ్చిన నైకూ చివరకు సొంతూరిలోనే హతమయ్యాడు.