HMD forecast Heavy rains for Telangana in next 24 hours
mictv telugu

మరో 24 గంటల్లో తెలంగాణకు భారీ వర్షాలు

August 8, 2022

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఒడిశా- పశ్చిమబెంగాల్‌ తీరంలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తరాంధ్ర తీరం వద్ద కేంద్రీకృతమైందని.. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈనెల 9, 10 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణశాఖ. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని ఐఎమ్‌డీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.