గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఓ వైపు చేతికి వచ్చిన పంటలు నీటిపాలవుతున్నాయని రైతన్నలు ఆవేదన చెందుతుండగా.. మరోపక్క ప్రధాన పట్టణాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ కారణంగా నగరవాసులు ఇబ్బందిపడుతున్నారు. అయితే.. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది.