HMDA to lease Outer Ring Road for long term
mictv telugu

తెలంగాణ : లీజుకు ఔటర్ రింగ్ రోడ్డు.. ఒకేసారి 5 వేలకోట్ల ఆదాయం!

September 3, 2022

HMDA to lease Outer Ring Road for long term

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమై విజయవంతంగా నడుస్తున్న ఔటర్ రింగ్ రోడ్డును దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనున్నారు. సుమారు 20 నుంచి 25 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చి ఒకేసారి రూ. 4 నుంచి 5 వేల కోట్లను రాబట్టే ప్రణాళికను హెచ్‌ఎండీఏ వేసింది.

ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌ను టీవోటీ (టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో లీజుకు ఇవ్వడానికి నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 21 లోగా బిడ్ దాఖలుకు గడువు విధించింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని బిడ్డర్లకు ఇవ్వనున్నారు. ఆ సమయంలోనే పూర్తి స్థాయి నివేదికను బిడ్డర్లు హెచ్ఎండీఏకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ వసూలు ద్వారా రోజుకి రూ. 1.16 కోట్లు, నెలకు రూ. 35 కోట్లు, ఏడాదికి రూ. 421 కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే ప్రతీఏటా వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో భవిష్యత్తులో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలా లీజుకి ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో ఔటర్ చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.