ఈ రోజు దేశవ్యాప్తంగా హోళీ ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లాపెద్దా, ముసలీ ముతకా, ఆడా మగా అందరూ రంగులు చల్లుకుంటూ ఖుషీ చేస్తున్నారు. కామదహనాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వీధుల్లో పిడకలు, పాత వస్తులు కుప్పబోసి మంటలు వేస్తున్నారు. దేశమంతా ఇలా సాగుతుంటే ఓ ఊరిలోని మగవాళ్లు మాత్రం బుద్ధిగా కాళ్లు చేతులు ముడుచుకుని ఇంట్లోనే ఉండిపోయారు. లేకపోతే పొలానికి వెళ్లిపోయారు. ఊరంతా హోళీ వేడుకలు సాగుతున్నా.. అందులో పాల్గొనే ధైర్యం లేక తోకలు ముడుచుకుని కూర్చున్నారు. ఎందుకంటే, అక్కడ వసంతాలను కేవల ఆడవాళ్లే చల్లుకోవాలి. బాలికలు, యువతులు, మహిళలు, బామ్మలు మాత్రమే ఎంజాయ్ చేయాలి. తాము కూడా ఎంజాయ్ చేస్తామని పురుష పుంగవులు మధ్యలోకి దూరిది దబిడి దిబిడే.
ఈ లేడీ స్పెషన్ హోళీ ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లా కుంద్రా గ్రామంలో జరుగుతుంది. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వకాలంలో స్త్రీపురుషులు కలిసి హోళీ చేసుకుంటున్నప్పుడు బందిపోటు దొంగలు దాడి చేశారు. రాజాల్ అనే స్థానికుడిని కాల్చి చంపేశారు. తర్వాత దొంగలకు భయపడి హోళీకి దూరంగా ఉండిపోయారు. కొన్నేళ్ల తర్వాత ఆడవాళ్లు ధైర్యంగా ముందుకొచ్చి వేడుక చేసుకున్నారు. బందిపోట్లు రాలేదు. ఆడవాళ్ల ధైర్యానికి మెచ్చి గౌరవంతో ఆ పండగను వాళ్లకే పరిమితం చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు రంగులకు మగవాళ్లు దూరమయ్యారు.