దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ అంగరంగ వైభవంగా జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు విభిన్న రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని హోలీని సంతోషంగా జరుపుకుంటున్నారు. హోలీ పండుగ వేడుకలు ఒక్కో ప్రాంతంలో వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. అయితే ఎక్కడైనా రంగులు, కోడిగుడ్లు, బెలూన్లు, టమాటాలతో హోలీ ఆడటం కామనే. కానీ, ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో మాత్రం అక్కడి ప్రజలు విషపూరితమైన తేళ్లతో హోలీ ఆడతారు. అవును మీరు చదివింది నిజమే. చిన్నా, పెద్దా అన్న తేడాలేదు ఆ గ్రామంలోని వారంతా తేళ్లను చేతుల్లో పట్టుకుని మరీ హోలీ పండుగను జరుపుకుంటారు.
ఇటావా జిల్లాలోని సౌత్నా గ్రామంలో తేళ్లతో హోలీ జరుపుకునే సంప్రదాయాన్ని గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు ప్రజలు. ఇది ఎలా మొదలు అయ్యిందంటే…సౌత్నా గ్రామంలో ఓ పురాతన కోట ఉంది. ఆ కోటలో వేలాదిగా ఇటుకలు, రాళ్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇక్కడ అంతా సర్వసాధారణంగానే ఉంటుంది. కానీ హోలీ పౌర్ణమి రెండో రోజు సాయంత్రం మాత్రం ఈ కోటలో ఏ ఇటుక కదిపినా వేలాదిగా తేళ్లు బయటకు వస్తాయి. ఈ సమయంలో గ్రామంలోని పెద్దలు , పిల్లలు కోటకు చేరుకుని ఆ తేళ్లను తమ చేతుల్లోకి తీసుకుని రంగులు చల్లుకున్నట్లు వారు తేళ్లను ఒకరిపై ఒకరు విసురుకుంటారు.
విషపూరితమైన ఈ తేళ్లు హోలీ రోజు మాత్రం ఎలాంటి హాని తలపెట్టవని ఇక్కడి ప్రజల విశ్వాసం. అవి ఏ మనిషిని కాటేయవని అంటున్నారు సౌత్నా గ్రామ ప్రజలు. తేళ్లను వారి సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు వీరు. ఈ సంప్రదాయం వింతగా ఉండటంతో చుట్టుపక్కన జిల్లాలకు ఈ విషయం పాకిపోయింది. హోలీ సమయంలో ఈ వింతను చూసేందుకు ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. తేళ్లు వచ్చే వరకు కోట వద్దే ఉండి వాటిని చల్లుకుంటారు.