హైదరాబాద్‌లో రహదారులు భయపెడుతున్నాయి. ఉన్నట్లుండి రోడ్లు కూలిపోవడం, గుంతలు పడడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో రోడ్డు కుంగిపోయిన ఘటన, హిమాయత్ నగర్ రోడ్ నెంబర్-5 లో గుంతలు ఏర్పడిన ఘటన మరువకముందే గరంలోని మరో ప్రధాన రహదారిలో రోడ్డుకు గుంత ఏర్పడడం చర్చనీయాంశమైంది. రోజు వేలాది వాహనదారులు ప్రయాణించే ఎంజీబీఎస్-చాదర్‌ఘాట్ రహదారిపై పెద్ద గుంత ప్రత్యక్షమైంది. దీంతో వాహనదారులను గుంతవైపు పోనియకుండా పోలీసులు భారీకేడ్లు అడ్డంపెట్టారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గుంతను పరిశీలించారు. దాదాపు 20 అడుగుల లోతు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికిప్పుడు వాహనాలను నిలిపివేసి గుంత పూడ్చేయడం సాధ్యం కాదని తేల్చిన అధికారులు.. రాత్రి పూట రహదారిని మూసివేసి మరమ్మతులు కొనసాగిస్తామని వెల్లడించారు.