భూమి ఊపిరితిత్తుల కోసం 36 కోట్లు ఇచ్చిన హీరో
భూమాత ఊపిరితిత్తులుగా పేరుగాలంచిన అమెజాన్ అడవుల్లో రగిలిన కార్చిచ్చుపై హాలీవుడ్ హీరో ‘లియోనార్డో డికాప్రియో’ ఆవేదన వ్యక్తం చేశారు. అతిపెద్ద అడవిలో చెట్లు, వన్యప్రాణాలు కాలిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం ఆక్సిజన్ అందించే అడవులు కాలిపోవడంతో వాటి సంరక్షణ కోసం ముందుకు వచ్చారు. ఆయన ఇటీవల ఏర్పాటు చేసిన ‘ఎర్త్ అలయన్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా 5 మిలియన్ డాలర్లు ( రూ.36 కోట్లు ) విరాళం ప్రకటించారు. ప్రతి ఒక్కరు అడవుల సంరక్షణను చేపట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అమెజాన్ అడవుల్లో ఉండే చెట్లు, వన్యప్రాణులు, అక్కడి గిరిజనుల సంరక్షణ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించాలని కోరారు. దీంతో పాటు ఆయన అభిమానులు కూడా విరాళం ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. 16 రోజులుగా అడవులు కాలిపోతుంటే పట్టించుకునేవారే కరువయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణానికి ముప్పు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు విధిగా చెట్లు నాటాలని కోరారు. కాగా లియోనార్డో హీరోగానే కాకుండా పర్యావరణవేత్తగా కూడా ఉన్నారు. అడవుల రక్షణ కోసం జులైలో ‘ఎర్త్ అలయన్స్’ అనే పర్యావరణ ఫౌండేషన్‌ను స్థాపించారు. లియోనార్డో తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.