నిర్మాతకు షాకిచ్చిన కోర్టు.. అత్యాచారం కేసులో అతడే దోషి - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మాతకు షాకిచ్చిన కోర్టు.. అత్యాచారం కేసులో అతడే దోషి

February 25, 2020

Hollywood

దశాబ్దాలపాటు సినిమా రంగాన్ని ఏలిన ప్రముఖ హాలీవుడ్ నిర్మాతకు కోర్టు షాక్ ఇచ్చింది.  నేరం చేసినట్లు రుజువు అవడంతో సదరు నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్‌(67)ను దోషిగా పేర్కొంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది. తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దాదాపు 80 మంది నటీమణులు 2017లో ఆయనపై ఆరోపణలు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హార్వే ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. అనూహ్యంగా 2018 మే నెలలో పోలీసులకు ఆయన లొంగిపోక తప్పలేదు.  ‘ఐరన్‌మ్యాన్ 3’, ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ తదితర చిత్రాల్లో నటించిన గ్వైనెత్ పాల్ట్రో, ‘కిల్ బిల్’ ఫేమ్ ఉమా తుర్మన్, సల్మా హాయేక్ వంటి ప్రముఖ నటీమణులే ప్రజల ముందుకు వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. వారిని చూసి చాలామంది హార్వే బాధితులు బయటకు వచ్చి అతనిపై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో హాలీవుడ్‌లో ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. హార్వేపై పలు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు హార్వేను దోషిగా ప్రకటించింది.  

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే హర్వేకు గుండెనొప్పి రావడంతో న్యూయార్క్‌లోని బెల్లెవ్యూ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఈ కేసులో తుది తీర్పును మార్చి 11కు వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో హార్వే తరఫు న్యాయవాది హర్వేపై ఆరోపణలు చేస్తున్నవారివి నిరాధార ఆరోపణలు అని వాదిస్తున్నారు. హార్వేపై నమోదైన కేసుల్లో ప్రధాన బాధితుల్లో కొందరు.. తమపై హార్వే ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతనితో శృంగారానికి అంగీకరించామని తెలిపారు. దీంతో పరస్పర అంగీకారంతోనే శృంగారం జరగడంతో హార్వేకు ఎటువంటి శిక్ష పడే అవకాశం లేదని చాలామంది అనుకుంటున్నారు. అయితే వీరి అంచనాలను తలకిందులు చేసిన కోర్టు హార్వేని దోషిగా ప్రకటించింది. కాగా, హార్వే నిర్మించిన పల్ప్ ఫిక్షన్, గుడ్ విల్ హంటింగ్, ది కింగ్స్ స్పీచ్ తదితర చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి.కాగా, హార్వేను న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతించారు. న్యూయార్క్‌ కోర్టు ఇచ్చిన తీర్పును మహిళలు సాధించిన గొప్ప విజయంగా ట్రంప్‌ అభివర్ణించారు. భారత పర్యటనలో భాగంగా.. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ ఈ విషయంపై స్పందించారు