ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్ళు అలసిపోతాయి. నొప్పి, మంట, నీరు కారడం ఇలాంటి ప్రాబ్లెమ్స్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి.ఇలాంటి కళ్ళ ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించే మాస్క్‌లను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చును. ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.
రోజ్‌వాటర్‌లో కాటన్ ను కాసేపు నానబెట్టాలి. తరువాత కాటన్‌ను రెండుకళ్లపై మొత్తం కప్పి ఉంచి, ఓ పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి. ఒకసారి ఇలా చేసిన తరువాత కాటన్‌ను రిఫ్రిజిరేటర్లో పెట్టి మరోసారి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల కళ్ళు చల్లబడతాయి. దీంతో నల్లని వలయాలు సైతం తగ్గుముఖం పడతాయి.
టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత టీ బ్యాగ్‌లను నీటి నుంచి బయటకు తీసి, టీబ్యాగ్లో అధికంగా ఉన్న నీటిని పిండి కళ్ళమీద పెట్టుకుని పదినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి తగ్గడంతోపాటు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.అలాగే కళ్ళకి ఉన్న ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. మిశ్రమం చల్లబడిన తరువాత .. కాటన్ బాల్‌ను ముంచి కళ్ళమీద పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి. దీనివలన కళ్ళ ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్ళ చుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి. వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్ళు హాయిగా ఉంటాయి. రోజూ వర్క్ అయిన తర్వాత లేదా మధ్యలో ఖాళీ దొరికినప్పుడూ చేస్తుంటే మంచిది. కళ్ళ గురించి అశ్రద్ధ పనికిరాదు.