honey trap in tspsc Exam paper leak incident
mictv telugu

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా పేపర్ల లీకేజీ వెనుక హానీట్రాప్!!

March 12, 2023

honey trap in tspsc Exam paper leak incident

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన పేపర్ లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్లు హ్యాకింగ్ కాలేదని అధికారులు గుర్తించారు. ప్రవీణ్‌తో ఓ యువతి ఉంటున్నదని, ఆమె కోసం ప్రవీణ్ ఈ పేపర్‌ను బయటకు పంపినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ప్రవీణ్‌కు ఓ యువతి పరిచయమైంది. ప్రవీణ్‌తో సదరు యువతి సన్నహితంగా ఉంటూ.. కొద్దిరోజులుగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి కూడా వచ్చేదని తెలిసింది. ఈ క్రమంలోనే టౌన్ ప్లానింగ్ పరీక్షా పేపర్ ఇవ్వాలని సదరు యువతి ప్రవీణ్‌ను కోరింది. దీంతో ప్రవీణ్ సిస్టమ్‌లో ఉన్న పేపర్‌ను కాపీ చేసుకొని యువతికి ఇచ్చాడు. ఈ వ్యవహారంలో హ్యాకింగ్ జరగలేదని పోలీసులు తేల్చారు. అయితే కాన్ఫిడెన్షియల్ సిస్టమ్‌లో ఓపెన్ చేసి పేపర్ ఎలా కాఫీ చేశాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పేపర్ కాఫీ చేసిన తర్వాత ఎవరెవరికి ఇచ్చాడు. ఎంత మంది చేతులు మారింది అనే దానిపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

పేపర్ లీక్ ఘటనలో మెుత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ప్రశ్నాపత్రం బయటకు వచ్చినందున ఇవాళ జరగాల్సిన పరీక్షతో పాటు ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ సిస్టెంట్ సర్జన్ నియామాకాల పరీక్షలను రద్దు చేశారు. ఈ మేరకు అభ్యర్ధులకు సమాచారం పంపారు.