ఒక్కొక్కరికి రూ.90 వేలు ఇస్తున్న ప్రభుత్వం.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కొక్కరికి రూ.90 వేలు ఇస్తున్న ప్రభుత్వం.. ఎందుకంటే..

February 27, 2020

Hong Kong

విదేశాల్లో ఉన్న నల్లధనం బయటకు వస్తే ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు పడతాయంటే నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. ‘ఊది కాలదు పొగ రాదు’ అన్న చందంగా మారిపోయింది ఆ మాట. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. హాంకాంగ్ ప్రభుత్వం దేశంలోని పౌరులకు ఒక్కొక్కరికి రూ.90వేలు నగదు ఇవ్వాలని యోచిస్తోంది. ఎందుకంటే.. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కుదేలై నిండా ఆర్థిక మాద్యంలో కూరుకుపోయింది. కరోనా వైరస్ ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతో ఆ దేశ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. దీంతో ప్రభుత్వం ఆర్థిక మాద్యం నుంచి గట్టెక్కేందుకు, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు 120 బిలియన్ హాంకాంగ్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి రూ. 10వేల హాంకాంగ్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.90వేలు) ఇవ్వనుంది. 

అలాగే కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయ పన్ను మొత్తాన్ని తగ్గించింది. తక్కువ ఆదాయం ఉన్న నిర్వాసితులకు ప్రభుత్వ గృహాల్లో ఉచిత అద్దె ఇవ్వాలని.. 2 లక్షల మంది నిరుపేద గృహాలకు లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోది. ఇది కేవలం శాశ్వత పౌరులకు మాత్రమే చెల్లిస్తుంది. వారు 18ఏళ్లు పైబడిన వారు అయితేనే ఇందుకు అర్హులు అవుతారు. ఈ ప్యాకేజీ ద్వారా 70లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ దేశ ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ‘గత 15ఏళ్లలో ఇంత ఆర్థిక మాంద్యం పరిస్థితులు రావడం ఇదే తొలిసారి. 2019 అక్టోబర్ నుంచి హాంకాంగ్‌లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆర్థిక లోటు మరింత పెరగొచ్చనే ఆందోళన ఉంది. ఈ ఏడాది హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ అపారమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సమీప కాలంలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు’ అని విచారం వ్యక్తం చేశారు.