సినిమా షూటింగ్‌ తలపించేలా సాహసం..హంకాంగ్‌లో నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా షూటింగ్‌ తలపించేలా సాహసం..హంకాంగ్‌లో నిరసన

November 19, 2019

Hong Kong.

హంకాంగ్‌లో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా తీరును నిరసిస్తూ అక్కడి ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కుతున్నారు. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీలో నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బయటకు రాకుండా నిర్భందించడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ధర్నాలో పాల్గొనేందుకు నల్ల ముసుగులు ధరించిన పదుల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.

సినిమా షూటింగ్‌ను తలపించేలా విద్యార్థఉలు తాళ్ల సాయంతో యూనివర్శిటీ భవనంపై నుంచి కిందకు దిగారు. మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా సాహసోపేతంగా కిందకు వచ్చారు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఆందోళన చేపట్టారు. అలా వెళ్లిన విద్యార్థులంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా చాలా రోజులుగా హాంకాంగ్‌ అట్టుడుకిపోతోంది. చైనా తమ ప్రతిపత్తిని కాలరాస్తోందంటూ అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా ఉద్యమం ప్రారంభించారు.  ఈ కారణంగా దేశవ్యాప్తంగా పలు పాఠశాలలు మూతబడ్డాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హంకాంగ్‌లో ఆందోళనలపై చైనా గుర్రుగా ఉంది. వారి ఉద్యమాన్ని అణిచివేసేందుకు బలగాలను మోహరిస్తోంది.