Honor killing in Wanaparthy district.. Father hacked daughter to death with axe
mictv telugu

వనపర్తి జిల్లాలో పరువు హత్య.. కన్నకూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

October 26, 2022

వనపర్తి జిల్లాలో మంగళవారం జరిగిన ఓ పరువు హత్య కలకలం రేపుతుంది. సొంత తండ్రే తన చిన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. తన మాట వినకుండా ఓ అబ్బాయితో స్నేహం చేస్తోందని కూతురిపై ఒకటి కాదు.. రెండు కాదు.. 8 సార్లు గొడ్డలితో వేటు వేశాడు. పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో రెండవ కూతురు గీత(16) పెబ్బేరు లోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఇదే క్రమంలో వారి సొంత గ్రామానికి వారీ సామాజిక వర్గానికి, వరుసకు బంధువైన యువకుడిని ప్రేమించింది. ఈ విషయమై తండ్రి, కుటుంబ సభ్యులు పలు మార్లు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

గత రెండు మూడు రోజులుగా ఇంట్లో ఇదే విషయమై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కూతురికి మరోసారి నచ్చజెప్పాడు. కుటుంబ పరువు పోగొట్టవద్దని..బుద్ధిగా చదువుకోవాలని.. ప్రేమించే వయస్సు కాదని చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై, విచక్షణ కోల్పోయిన తండ్రి కుమార్తె మెడపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ సంఘటనలో గీత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. దీనితో తండ్రి రాజశేఖర్ నేరుగా పెబ్బేరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని గురించి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దీనితో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రామస్వామి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. గీత తండ్రి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకొని హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.