కులమతాలు, పరువు ప్రతిష్ట పేరుతో పెద్దలు ఘోర నేరాలకు తెగబడుతున్నారు. కులం పేరుతో మనదేశంలో సాగుతున్న హత్యలకు ఏ చట్టాలూ అడ్డుకట్టవేయలేకపోతున్నాయి. కులాల ప్రసక్తి ఉండదని భావించే ముస్లిం దేశాల్లోనూ ఈ నేరాలు సాగిపోతున్నాయి. తమ కుటుంబ పరువు పోతోందన్న అక్కసుతో ప్రేమజంటను అత్యంత భయానకంగా నరికి చంపారు. ఇద్దరినీ తాళ్లతో కట్టేసి తలలు తీశారు.
పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. అతాక్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి, 21 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో వారు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదుగాని అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చాడు. అమ్మాయి తండ్రి, మామ.. అతణ్ని పట్టుకుని బంధించారు. అతనితోపాటు అమ్మాయిని కూడా తాళ్లతో కట్టేసి పదునైన ఆయుధంతో శిరచ్ఛేదం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఏటా వెయ్యి పరువు హత్యలు
పాకిస్తాన్లో పరువు హత్యలు కొత్తేమీ కాదు. ముస్లింలో భిన్న వర్గాలకు చెందిన వారి మధ్య పెళ్లిళ్లకు పెద్దలు అడ్డుచెబుతున్నారు. ఆస్తులు, అంతస్తులు కూడా ప్రేమజంటల హత్యకు కారణమవుతున్నాయి. తాజా పరువు హత్య జరిగిన పంజాబ్లో గత నెలలో 17 ఏళ్ల యువతిని ఆమె అన్నే కాల్చి చంపాడు. పాక్ మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం.. ఆ దేశంలో ఏటా వెయ్యిమంది మహిళలను, బాలికలను పరువు పేరుతో చంపేస్తున్నారు. అమ్మాయి తండ్రులు, సోదరులే ఈ ఘాతుకానికి తెగబడుతున్నారు.