బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నటి దీపికా పడుకొణెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆమె కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అవుతారని.. ప్రధాని అయ్యే అర్హతలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని దీపికా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ మీడియా గతంలో నిర్వహించిన ఇంటర్య్వూలో రాహుల్‌పై దీపిక ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్ ముందుంటారని.. అంతేకాకుండా అసలైన దేశభక్తి తనకు రాహుల్‌లో కనిపిస్తుందని వ్యాఖ్యానించింది.
యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అభిప్రాయపడింది. మంచి నాయకుడికి ఆయనే సరైన ఉదాహరణ అని, ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందని తెలిపింది. అయితే డ్రగ్స్ కేసులో భాగంగా శనివారం దీపిక విచారణ ముగిసినప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఆధారంగా ఓ వర్గానికి చెందినవారు తెగ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు జేఎన్‌యూ ఘటనపై కూడా దీపిక విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా, బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం డ్రగ్స్ కేసు తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ఎన్సీబీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బహిర్గతం చేయగా.. ఇప్పటికే శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీతిసింగ్, దీపికలను ఎన్సీబీ అధికారులు విచారించారు. మరికొందరిని విచారించనున్నారు.