Horrible..husband who cut his wife's throat in the court..
mictv telugu

ఘోరం..కోర్టులోనే భార్య గొంతు కోసిన భర్త..

August 14, 2022

పెళ్లి చేసుకొని, ఏడేళ్లపాటు కాపురం చేసి, ఎలాంటి గొడవలు పడకుండా కలిసి బతుకుతామని మాటిచ్చి, కోర్టులోనే అతి కిరాతకంగా ఓ భర్త తన భార్య గొంతును కోసేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

”హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌, చైత్రలకు ఏడేళ్ల కింద వివాహమైంది. కొన్ని విభేదాల కారణంగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంతో కోర్టు అధికారులు వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. విభేదాలను పరిష్కరించుకుని, కలిసి జీవించాల్సిందిగా సూచించారు. దానికి కౌన్సెలింగ్ సెషన్‌లో ఇద్దరూ అంగీకరించారు. కలిసి ఉంటామని ఇద్దరూ ఒకరికి ఒకరు మాటిచ్చుకున్నారు. కోర్టులోని కౌన్సెలింగ్ గది నుంచి బయటికి వచ్చాక, కాసేపు ఆవరణలో నిలబడ్డ శివకూమార్.. చైత్ర బాత్రూం కోసం వెళుతుండగా, ఒక్కసారిగా ఆమె వైపు దూసుకెళ్లి, తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో గొంతు కోసేశాడు” అని పేర్కొన్నారు.

ఆ తర్వాత ఆమె రక్తపు మడుగులో పడిపోగానే, శివకూమార్ పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడున్న కొందరు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు. గొంతును కోసేయడంతో రక్తపు మడుగులో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చైత్రను.. బంధువులు, అక్కడున్నవారు ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ, కాసేపటికే చనిపోయిందని, శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. అసలు కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరాలను వెల్లడించారు.