Horrible incident in Hyderabad..Seven people died
mictv telugu

హైదరాబాద్‌లో దారుణ ఘటన..8 మంది మృతి

September 13, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గతరాత్రి దారుణం జరిగిపోయింది. ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న 8 మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని, మృతులను వెలికితీశారు. గాయపడిన మిగతావారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పురుషులు, ఓ మహిళ మృతి చెందారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఎ.హరీశ్, చెన్నై వాసి సీతారామన్, ఢిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం ఓ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో మొదలై, మంటలు ఒక్కసారిగా చేలరేగి, పై అంతస్తులకు వ్యాపించి లాడ్జీలోకి ప్రవేశించాయి. దాంతో లాడ్జిలో విశ్రాంతి తీసుకుంటున్న పర్యాటకులు వ్యాపిస్తున్న మంటలకు ఏం చేయాలో దిక్కుతోచక, ఊపిరాడక పలువురు స్పృహ కోల్పోయి, లాడ్జిలోని గదులు, ఆవరణలో పడిపోయారు.

”మోండా మార్కెట్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పాస్ పోర్ట్ కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ఫ్రెడ్ పేరిట అయిదంతస్తుల భవనం ఉంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉధృతి మరింత పెరిగింది. వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మెట్ల మార్గం ద్వారా మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. దీనికితోడు వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించాము.” అని పోలీసులు తెలియజేశారు.