మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలున్నారు. నాసిక్ జిల్లా పథారే సిన్నార్ సమీపంలో నాసిక్-షిర్డీ రహదారిపై ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో అంబర్నాథ్ థానే ప్రాంతానికి చెందిన 50 మంది సాయి భక్తులు.. షిర్డీ బయలుదేరారు. పథారే ప్రాంతంలో బస్సు- లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సిన్నార్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
భక్తులంతా దైవదర్శనానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం.. విధి వక్రీకరించి అందులోని కొందరు దురదృష్ట వశాత్తూ మరణించడం విషాదాన్ని నింపింది. పతారే గ్రామ శివారులోని ఆ రోడ్డంతా రక్తసిక్తమైంది. మృతుల బంధువులు ఇప్పుడే సిన్నార్ రూరల్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దేవుని దర్శనం కోసమని బయల్దేరి తిరిగిరాని లోకాలకు వెళ్లారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.