Hospital sources revealed the cause of death of Krishnamraju
mictv telugu

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. అదే కారణమంటున్న ఆస్పత్రి వర్గాలు

September 11, 2022

ప్రముఖ దిగ్గజ నటుడు, తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు(82) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు గత నెలరోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో కృష్ణంరాజు చనిపోయినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. కృష్ణంరాజు దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. పోస్ట్ కోవిడ్ సమస్య కారణంగా గతనెల 5న ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో చేరిన తరువాత మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని, కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటినుంచి వెంటిలేటర్ పై చికిత్స అందించామని డాక్టర్లు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 183 సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కృష్ణంరాజు మృతి తెలుగు చిత్ర సీమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.