ఊళ్లకు వెళ్తాం ప్లీజ్..హైదరాబాద్‌లో హాస్టల్ కష్టాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఊళ్లకు వెళ్తాం ప్లీజ్..హైదరాబాద్‌లో హాస్టల్ కష్టాలు

March 25, 2020

Hostel

కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్‌లోని వివిధ హాస్టళ్లలో ఉంటున్న వారికి  కష్టాలు మొదలయ్యాయి. అధికారుల ఆదేశాలతో నిర్వాహకులు ఆశ్రయం పొందుతున్న వారిని ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏం చేయాలో తెలియక తాము సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. అమీర్‌పేట,ఎస్సార్‌నగర్ ప్రాంతాల్లో ఉండే హాస్టలర్స్ ఇలా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని ప్రజా రవాణా సేవలు నిలిచిపోయాయి. బయటకు వెళ్లే వారికి ఊర్లకు వెళ్లేవారిని పోలీసులు అనుమతించడం లేదు. ఈ విషయం తెలిసినా కూడా హాస్టల్ నిర్వాహకులు కూడా ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కనీసం తాము సొంత ఊళ్లకు వెళ్లడానికైనా అనుమతి ఇవ్వాలంటూ యువతి, యువకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇళ్లకు వెళ్లాలని అనుకునే వారికి అనుమతి పత్రాలు ఇస్తున్నారు. ఇది కేవలం ఒకసారి మాత్రమే పని చేస్తుందని, ఆ తర్వాత ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకూడదని పోలీసులు చెప్పి పంపిస్తున్నారు. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద బ్యాచ్‌లర్స్ బారులు తీరారు.