రూ. 10కే బిర్యానీ అమ్మిన హోటల్ యజమాని అరెస్టు - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 10కే బిర్యానీ అమ్మిన హోటల్ యజమాని అరెస్టు

October 20, 2020

Hotel owner arrested for selling biryani at ten rupees

ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడితే కష్టమర్లను ఆకర్శించడానికి యజమానులు ఆఫర్లు ప్రకటిస్తారు. బట్టలు, చెప్పులు, హోటళ్లు ఇలా వ్యాపారం ఏదైనా ఆఫర్లు సహజం. వ్యాపారం ప్రారంభించిన రోజు ఆఫర్ ప్రకటిస్తారు. ధరలో భారీగా డిస్కౌంట్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టి ప్రజలకు డిస్కౌంట్ ఇచ్చిన వ్యాపారిని పోలిసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. రాష్టంలోని అరుప్పుకొట్టైకి చెందిన జహీర్‌ ఆదివారం బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించాడు. మొదటిరోజు కావడంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకూ కేవలం రూ.10లకే బిర్యానీని అమ్ముతున్నట్టు ప్రకటించారు. 

అసలే ఆదివారం.. ఆపై రూ. 10కే బిర్యానీ. దీంతో ప్రజలు ఎగబడ్డారు. వందల్లో వచ్చి గుమిగూడారు. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. బిర్యానీ సెంటర్ దగ్గర ప్రజలు ఎవ్వరూ భౌతిక దూరం పాటించడం లేదు. కొందరు మాస్కులు కూడా పెట్టుకోలేదు. దీంతో పోలీసులు కోపం వచ్చింది. ప్రజలను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. తరువాత జనాలు కొవిడ్ నిబంధనలు అతిక్రమించడానికి కారణమైనందుకు జహీర్‌ను అరెస్టు చేశారు. బిర్యానీ పొట్లాలను యాచకులకు దానం చేశారు. జహీర్‌పై 188, 269, 278 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మళ్ళీ ఇలాంటి ఇలా చేయకూడదని వార్నింగ్ ఇచ్చి బెయిల్‌పై విడుదల చేశారు.