హోటల్ ఓనర్ను చంపి.. శరీరాన్ని ముక్కలు చేసిన యువజంట
ఢిల్లీలో జరిగిన శ్రద్ధవాకర్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య మనిషిని చంపి శరీరాన్ని ముక్కలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కేరళలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ అనే హోటల్ యజమానిని ఓ యువజంట అత్యంత దారుణంగా చంపారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగులో తీసుకెళ్లి అటవీప్రాంతంలో విసిరేశారు.
సిద్ధిఖ్ అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం కోజికోడ్ జిల్లాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మే 18న కోజికోడ్‌లోని ఎరంజిపాలెంలో ఉన్న ఓ హోటల్లో బి3, బి4 గదులను బుక్ చేసుకున్నారు. అదే హోటల్లో పాలక్కడ్‌కు చెందిన నిందితులు శిబిల్, ఫర్హానా కూడా రూమ్స్ బుక్ చేసుకున్నారు. మే 19న శిబిల్, ఫర్హానా ఓ ట్రాలీబ్యాగుతో కిందకు దిగిన దృశ్యాలు హోటలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఆ తర్వాత వీరు ముగ్గురూ అదృశ్యమయ్యారు.
సిద్ధిఖ్‌కు అతడి కుమారుడు ఎన్నిసార్లు ఫోను చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే సమయంలో అతడి ఫోనుకు తండ్రి కార్డుతో రూ.లక్ష డ్రా చేసినట్లుగా ఏటీఎం నుంచి మెస్సేజులు వచ్చాయి. ఏదో జరిగిందనే అనుమానంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధిఖ్ హత్యకు గురైనట్లు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రధాన నిందితుడైన శిబిల్ గతంలో సిద్ధిఖ్ హోటల్లోనే పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చక పనిలో నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే హత్య జరగడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఎరంజిపాలెంలో సిద్దిఖీ ఎందుకు గది తీసుకున్నారు..? ఒక గది కాకుండా రెండు గదులు ఎందుకు తీసుకున్నారు. ఘటన వెనుక హనీ ట్రాప్ ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.