మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడతను. దయ, జాలి వంటివి ఏమాత్రం లేని వ్యక్తి. అన్యాయంగా ముగ్గురు బిచ్చగాళ్లను సలసల మరిగే వేడి నీరు పోసి చంపేశాడు. అంతేకాక, శవాలను మూడు రోజుల దాకా అక్కడే ఉంచాడు. నిందితుడు స్థానిక ఎమ్మెల్యే బంధువు కావడంతో పోలీసులు కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణెలోని అహల్యాదేవీ మార్కెట్ సమీపంలో నీలేష్ అనే వ్యక్తి ఓ హోటల్ నడుపుతున్నాడు. హోటల్ ముందు రోజూ ముగ్గురు బిచ్చగాళ్లు కూర్చుండడంతో నీలేష్ వారిని వారించాడు.
అయినా వారు వినకపోవడంతో ఆగ్రహించి మే 23న వారిపై కర్రలతో దాడి చేశాడు. అంతటితో ఆగక వేడి నీళ్లు కుమ్మరించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు బిచ్చగాళ్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో బిచ్చగాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా వారు పట్టించుకోలేదు. హోటల్ యజమాని స్థానిక ఎమ్మెల్యేకు బంధువు కావడంతో ఒత్తిడితో వదిలేశారు. మరో ఘోరం ఏంటంటే.. బిచ్చగాళ్లు చనిపోయిన తర్వాత వారి శవాలను కూడా అక్కడి నుంచి తీయలేదు. మూడు రోజుల పాటు అక్కడే పడి ఉన్నాయి. దీంతో ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో వారం తర్వాత పోలీసులు మే 30న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.