నిరుపేదకు ఇల్లు కట్టించిన ‘ఫేస్‌బుక్’ - MicTv.in - Telugu News
mictv telugu

నిరుపేదకు ఇల్లు కట్టించిన ‘ఫేస్‌బుక్’

December 18, 2017

కత్తిని.. కర్రలు కొట్టడానికి కొట్టడానికి వాడొచ్చు.. మనిషిని చంపడానికీ వాడొచ్చు. దేన్నయినా వాడుకునేదాని బట్టి ఉంటుంది. సోషల్ మీడియా కూడా అంతే. మంచిగానూ వాడుకోవచ్చు. చెడుగానూ వాడుకోవచ్చు. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఒక నిరుపేద కుటుంబాన్ని ఫేస్‌బుక్ ఆదుకుంది. వారి విషాదగాథ విన్న ఫేస్‌బుక్ మిత్రులు తలో చెయ్యి వేసి ఇల్లు కట్టించారు.జ‌గిత్యాల‌కు చెందిన సామాజిక కార్యకర్త రేణికుంట ర‌మేశ్ చొరవతో ఇది సాధ్యమైంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బోర్లకుంఠ వెంకటి, పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ‍్లు. వృద్ధులైన వెంకటి తల్లిదండ్రులు వారితో కలసి ఉంటున్నారు. బతుకుతెరువు కోసం వెంకటి ఇరాక్‌కు వెళ్లగా.. పద్మ కూలిపనితో కుటుంబాన్ని పోషిస్తోంది. వీరు ఓ గుడిసెలో ఉండేవారు. కొన్ని నెలలకిందట ఈ గుడిసె ప్రమాదంలో బుగ్గి అయిపోయింది. అందరూ రోడ్డునపడ్డారు.

పాత్రికేయుడిగా పనిచేస్తున్న రేణకుంట రమేష్‌.. వారి పరిస్థితిని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆర్థిక సాయం చేశారు. 65 వేల విరాళాలు అందాయి. గ్రామ సర్పంచ్‌ దర్శనాల వెంకటస్వామి, ఆయన మిత్రులు రూ.90 వేలు సేకరించారు. ఈ డ‌బ్బుతో బాధితులకు ఇంటి కట్టించారు.  పిల్లల భవిష్యత్తు కోసం 30లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. కొత్త ఇంటిని సత్యసాయి అభయహస్తం సంఘం సభ్యులు ప్రారంభించారు.  ఫేస్‌బుక్‌ను కేవలం వినోదం కోసమే కాకుండా ఇలాంటి మంచి పనులకు కూడా వాడుకోవాలి.

(ఫొటోలు రేణికుంట రమేశ్ టైం లైన్ నుంచి)