అద్దె కట్టలేదని సామాన్లు రోడ్లో పడేశారయ్యా.. - MicTv.in - Telugu News
mictv telugu

అద్దె కట్టలేదని సామాన్లు రోడ్లో పడేశారయ్యా..

May 15, 2020

Old Women

కష్టకాలంలో కూడా కొంత మంది అద్దెంటి వారి నుంచి వేధింపులు తప్పడం లేదు. పనిలేక చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా మరచి కొంత మంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు అద్దె వసూలు చేయవద్దని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యజమాని వృద్ధురాలు అని కూడా చూడకుండా సామాను రోడ్డుపై పడేశాడు. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అద్దె ఇంటి యజమాని తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పాలకొల్లు ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో రామలక్ష్మీ అనే వృద్ధురాలు అద్దెకు ఉంటుంది. చిన్న చిన్న పుస్తకాలను మార్కెట్లో అమ్ముతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తోంది. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ విధించడంతో అమ్మకాలు జరగడం లేదు. దీంతో చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. తిండికే కష్టంగా మారిపోయింది. ఈ తరుణంలో యజమాని అద్దె చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. ఏప్రిల్‌ నెలలో ఇవ్వకపోవడంతో మే నెల కూడా వచ్చింది. అన్ని కలిపి ఇస్తానని చెప్పినా వినిపించుకోలేదు. అద్దె ఇస్తేనే ఇంట్లో ఉండాలంటూ ఆమె సామానును నడిరోడ్డుపై పడేశాడు. దీంతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమె రాత్రిపూట ఓ దుకాణం అరుగుపై గడపాల్సి వచ్చింది. ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలియడంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.