కరోనా పరీక్ష.. కొబ్బరినూనె, పుదీనాతో!  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పరీక్ష.. కొబ్బరినూనె, పుదీనాతో! 

October 21, 2020

How Coconut and Peppermint Can Help You Find if You Have COVID-19

కరోనా వైరస్ అంటేనే శ్వాసవ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వాసన, రుచి కోల్పోవడం వంటివి సంభవిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవే. కొందరికి ఈ లక్షణాలు ఉన్నా కొట్టి పారేస్తున్నారు. ‘ఎహె నాకెక్కడి కరోనా? అదేం లేదు’ అని లైట్ తీసుకుంటున్నారు. ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుని, బెడ్డు మీద పడి చికిత్స చేయించుకోవాలంటే జడుసుకునేవారు చాలామంది తయారయ్యారు. ఈ నేపథ్యంలో ఒంట్లో కరోనా ఉందో లేదో ఇంట్లోనే ఉండి తెలుసుకోవచ్చు అంటున్నారు మొహాలీలోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు.  

వాసన కోల్పోవడం లక్షణాలను బేస్ చేసుకుని సదరు పరిశోధకులు ఓ కొత్త విధానంపై పరిశోధన చేస్తున్నారు. పుదీనా, వెల్లుల్లి, సోంపు, కొబ్బరినూనె, యాలకుల వాసనలకు సంబంధించిన కిట్‌లను కొందరికి ఇచ్చి అందులో ఉన్నది ఏంటో వాసన చూసి చెప్పమన్నారు. వారిలో చాలామంది కొబ్బరినూనె, పుదీనా వాసనలను కనిపెట్టలేకపోయారు. 28 శాతం మంది పుదీనా, 21 శాతం మంది కొబ్బరినూనె వాసనను కనిపెట్టలేకపోయారు. దీంతో వారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మామూలు జ్వరం ఉన్నప్పుడు కూడా వాసనను కోల్పోతాం. అయితే, పుదీనా, కొబ్బరినూనెకు సంబంధించిన వాసనలను గుర్తించలేకుంటే వారికి కరోనా ఉన్నట్టు నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.  దీనిపై మరింత విస్తృతంగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. 

కాగా, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అవే కరోనా లక్షణాలు అని తెలిసిందే. అయితే యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా లక్షణాల జాబితాలోకి మరికొన్నింటిని చేర్చింది. రుచి, వాసన శక్తిని కోల్పోవడం, కండరాల నొప్పి వంటి లక్షణాలను కరోనా జాబితాలోకి చేర్చింది. అకారణంగా చలి, చలితో వణకడం, గొంతు నొప్పి మొదలైనవి కూడా కరోనా లక్షణాలని పేర్కోంది. SARS-CoV-2 బారిన పడిన 2 నుంచి 14 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని సీడీసీ స్పష్టంచేసింది. ఆగకుండా ఛాతిలో నొప్పి వస్తుండటం లేదా ఛాతిపై ఒత్తిడి ఉండటం అనేవి కూడా కరోనా లక్షణాలుగా పేర్కొంది. పెదాలు లేదా ముఖం నీలి రంగులోకి మారడం కూడా కోవిడ్ లక్షణాలైనా.. వాటిని కరోనా లక్షణాల జాబితాలో చేర్చలేదని తెలిపింది.