How dainosaurs vanished from earth
mictv telugu

అలా అంతం అయ్యాయిట…

November 7, 2022

డైనోసార్స్….పూర్వం అంటే వీటి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ జురాసిక్ పార్క్ సినిమా వచ్చాక మాత్రం ఇవి బాగా పాపులర్ అయ్యాయి. వాటితో పాటూ పెద్ద పెద్ద జంతువులు, అంతరించిపోయిన జాతులూ అన్నీ తెరమీదకు వచ్చాయి. అంతకు ముందే ఈ ఆనిమల్స్ మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నా మామూలు జనాలకు కూడా తెలిసే లెవల్లో అయితే మాత్రం లేదు. కానీ ఎప్పుడైతే జనాల్లో డైనోసార్లు బాగా పాపులర్ అయ్యాయో అప్పటి నుంచి వాటికి సంబంధించి ఏ కొత్త సమాచారం తెలిసినా ఇట్టే అందరికీ తెలిసిపోతోంది. స్పెషల్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూ వాటి గురించి దాదాపు ప్రపంచం అంతా న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంది. మచ్చక్కు ఒక్కటంటే ఒక్ డైనోసార్ కూడా బతికి లేకపోయినా…ఆ జాతి మొత్తం అంతా అంతరించిపోయినా వాటి ఉనికి మాత్రం ఇంకా సజీవంగానే ఉంది.

మనకన్నా ముందు భూమి మీద డైనోసార్లు ఉండేవని అందరికీ తెలిసిందే. అయితే అవి ఎప్పుడు ఎలా అంతమయ్యాయి అన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. డైనోసార్లు ఉంటే మనం ఉండేవాళ్ళం కాదు అన్న విషయం పక్కన పెడితే అంత పెద్ద జంతువులు ఎలా మాయమయ్యాయి అన్నది పెద్ద చిక్కుప్రశ్న.

డైనోసార్లు అంతం అవ్వడానికి కారణాలుగా ఇప్పటికే ఎన్నో థియరీలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త థియరీ వచ్చింది. దాని ప్రకారం 66 మిలియన్ ఏళ్ళ క్రితం దాదాపు 10 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టిందిట. దాని దెబ్బకు భూమి అటుదిటుగా అయిపోయిందట. ఆ విలయమే డైనోసార్లు మాయం అవ్వడానికి కూడా కారణం అయిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

గ్రహశకలం ఢీకొట్టినప్పుడు కొన్ని నెలల పాటూ భూమి వణికిపోయిందని…ఈ మెగా భూకంపం శక్తి 1023 జౌల్ వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఇది ఇప్పటివరకు పెద్దది అయిన ఇండోనేషియా సుమత్రా దీవుల భూకంపం కన్నా 50వేల రెట్లు ఎక్కువని చెబుతున్నారు. ఈ భూకంపానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా శాస్త్రవేత్తలు చూపిస్తున్నారుట.

బెర్ముడెజ్ అనే శాస్త్రవేత్త కొలంబియాలోని గోర్గోనిల్లా ద్వీపంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు గుండ్రంగా ఉన్న నిక్షేపాలను కనుగొన్నారుట. చిన్నచిన్న గాజు పూసల రూపంలో ఉండే ముక్కలు భూమిలో నిక్షేపం అయి కనిపించాయిట. అస్ట్రాయిడ్ ఢీకొన్నప్పుడు ఇవి భూమిలో కలిసిపోయాయని బెర్ముడెజ్ చెబుతున్నారు. ఇవి సముద్రంలో 2 కిలోమీటర్ల దిగువ కనిపించాయని తెలిపారు. వాటి ద్వారా జరిగిన ఉత్పాతాన్ని అంచనా వేశామని అంటున్నారు.