తెలంగాణను మళ్లీ ఏపీలో ఎట్లా కలుపుతారు.?: షర్మిల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణను మళ్లీ ఏపీలో ఎట్లా కలుపుతారు.?: షర్మిల

February 22, 2022

 

తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ ఏపీలో ఎట్లా కలుపుతారు అని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కేటీఆర్‌ను ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “ఇది బంగారు తెలంగాణ కాదు. బానిసత్వపు తెలంగాణ. తెలంగాణలో 66 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 41 లక్షల మందికి మాత్రమే బీమాను వర్తింపజేస్తున్నారు. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమాను ఎందుకు వర్తింపజేయడం లేదు. 59 ఏళ్లలోపే రైతులు చనిపోవాలని కేసీఆర్ ప్రభుత్వం కోరుకుంటోందా..?” అని షర్మిల ప్రశ్నించారు.

అంతేకాకుండా రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును తాము ఆశ్రయించామని, ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని అన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలపడం సాధ్యమా..?, ప్రజలను రెచ్చగొట్టేందుకే విలీనం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు.

మరోపక్క గతకొన్ని రోజుల క్రితం కేటీఆర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేందుకు కుట్రలు చేస్తారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.