how reduce screen time in kids
mictv telugu

డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?

November 16, 2022

పిల్లలు పెంపకం….ఇదో అంతులేని సబ్జెక్ట్. దీని గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతీ పిల్లా, పిల్లాడికి తేడాలు ఉన్నట్లే ప్రతీ తల్లిదండ్రుల పెపంకంలోనూ తేడా ఉంటుంది. పిల్లలు ఇంతకు మునుపులా లేరు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ పిల్లల తెలివితేటల్లో మార్పులు వస్తున్నాయి. 80, 90 లలో పిల్లలు అమ్మానాన్న ఎలా చెబితే అలా వినేవారు. తిరిగి ప్రశ్నించడం చాలా అరుదుగానే ఉండేది. కానీ తర్వాత తరం మాత్రంయప్రశ్నించడమే జన్మహక్కుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు చదువుకున్నవారు అవడం, అవేర్ నెస్ పెరగడం, పరిస్థితులు, పెంపకంలో అవగాహన మారడం ఇలాంటి కారణాలన్నింటి వల్లా పిల్లలు పుట్టడమే తెలివైన వాళ్ళుగా, హైపర్ గా పుడుతున్నారు. అలాంటివారిని హ్యాండిల్ చేయడం ఈ రోజుల్లో కష్టంగానే ఉంటోంది. నిజం చెప్పాలంటే కత్తిమీద సాము అనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ డిజిటల్‌ ప్రపంచం పేరెంట్స్‌ కష్టాలను మరింత పెంచేసింది. ఈ రోజుల్లో పిల్లలు గంటల తరబడి టీవీల ముందు, ఫోన్‌ స్కీన్‌ ముందు అతుక్కుపోతున్నారు. పేరెంట్స్‌ రెస్ట్రిక్ట్‌ చేస్తే.. ఏడ్చైనా, అరిచైనా పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అయిపోవడం చూసి వాళ్ళను ఎలా మార్చాలో అని తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలు డిజిటల్‌ స్ట్రీన్లకు అతుక్కునిపోవడం ఇప్పుడు తల్లిదండ్రులకు అత్యంత ఆందోళన కలిగించే విషయం. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఏమి చూస్తున్నారో? వారి ప్రవర్తన ఎలా ఎఫెక్ట్‌ అవుతుంది? పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? అనే బాధతో పేరెంట్స్‌ సతమతమవుతున్నారు. దీనిపై ఈ మధ్యనే సోషియో – ఎమోషనల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ MyPeegu ఒక సర్వే నిర్వహించింది. దీనిలో 61 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్‌ టైమ్‌ గురించి టెన్షన్‌ పడుతున్నట్లు గుర్తించారు. పిల్లల అభివృద్ధికి సమతుల్య ఆహారం ఎంత అవసరమో, బ్యాలెన్స్డ్‌ స్క్రీన్‌ టైమ్‌ కూడా అంతే అవసరమని MyPeegu వ్యవస్థాపకుడు, పేరెంటింగ్ నిపుణుడు చేతన్ జైస్వాల్ అంటున్నారు.

క్రియేటివ్ గా ఆలోచించాలి…

తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడానికి.. కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాలి. పిల్లల చేత బలవంతంగా ఏపనీ చేయించకూడదు. వాళ్ళ చేతిల్లోంచి ఫోన్లు లాక్కొవడం కాకుండా వాళ్ళే ఫోన్లు, టీవీలు వదిలేసేటట్లు చేయాలి. దానికి అమ్మానాన్నలు కొంత కష్టపడాలి. పిల్లలు మొండిగా ప్రవర్తించకుండా అర్ధం చేసుకునేట్టు చేయాలి. వాళ్ళు ఫోన్ చూస్తున్న సమయంలో ఇంకో పని చేయించాలి. వాళ్ళతో తల్లిదండ్రులే టైమ్ స్పెండ్ చేయాలి. తమ పని చేసుకుంటూనే పిల్లలు కూడా తమతో పాటూ పనిచేసేటట్టు లేదా ఆడుకునేట్టు చేసుకోవాలి. అంటే మన టైమ్‌ కొంత పిల్లలకు ఇవ్వాలి. వాళ్ళతో ఆటలాడాలి, తోటపని, వంటలో సహాయం లాంటివి చేయించొచ్చు. దీనివల్ల మన పని ఈజీగా అవుతుంది.. వారినీ ఫోన్‌కు దూరం పెట్టినట్టు అవుతుంది.

ఫోన్, టీవీ వల్ల వచ్చే నష్టాలు చెప్పండి….

ఫోన్, టీవీ అస్తమానం చూస్తుంటే వచ్చే దష్ప్రభావాలను పిల్లలకు చెప్పాలి. ఆ రేడియేషన్ వాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించండి. స్క్రీన్‌ ఎక్కువగా చూస్తే వచ్చే హెల్త్‌ ఇష్యూస్‌ గురించి అర్థం అయ్యేలా చేయాలి. ఒక్క రోజులో ఫోన్ చూసే అలవాటు మానేయాలి అని అనుకోకండి. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో, చదువుకు టైమ్‌లో, పడుకునే ముందు, మాట్లాడుకునే సమయంలో ఫోన్ ఇవ్వకుండా చూసుకోవాలి. ఫోన్‌కు పాస్‌వర్డ్ పెట్టి… వారికి కావాల్సినప్పుడు మనమే ఓపెన్ చేసేట్టు ఉంచుకోవాలి.

ముందు మనం మానేయాలి…
ఇప్పడు అందరికీ ఫోనే ప్రపంచం అయిపోయింది. ఫోన్ లోనే చాలా పనులు అవుతుండడం, ఎంటర్టైన్ మెంట్, చదువుకోవడం అన్నీ ఫోన్ లోనే అయిపోతుండడంతో తల్లిదండ్రులు కూడా ఫోన్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముందు దీన్ని తగ్గించాలి. మనం చేస్తున్న పనిని పిల్లలకు చేయొద్దని చెప్పడం సబబు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముందు మనం ఫోన్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాడాలి. ఒక వేళ ఉద్యోగ పరంగా ఫోన్‌ ఎక్కువగా వాడల్సి వస్తే.. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి.

సహనం అవసరం…

పిల్లలు ఒక రోజులో పోన్‌, టీవీ చూసే అలవాటు మానుకోలేరు. తల్లిదండ్రులు కొంత ఓపికతో ఉండాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళు ఫోన్లో ఏమి చూస్తున్నారు, వారి టేస్ట్‌లు అడిగి తెలుసుకోవాలి. అవి పిల్లలకు ఉపయోగపడకపోతే.. వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. సోషల్‌, డిజిటల్‌ మీడియా గురించి వివరించాలి. బుక్ రీడింగ్, మరికొన్ని హాబీస్ అలవాటు చేసుకునేలా ట్రైనింగ్ చేయాలి. పడుకునే ముందు వారికి ఒక మంచి పుస్తకం ఇచ్చి చూడండి. బుక్స్‌ చదివితే వారి పదజాలం, ఆలోచనా శక్తి, రాయడం వంటి నైపుణ్యాలు పెరుగుతాయి. కొన్నాళ్ళు ఈ పనులన్నీ తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటూ చేయాలి. అలవాటు అవ్వాలంటే కొంత టైమ్ పడుతుంది. అప్పటివరకు పేరెంట్స్ ఓపికగా పనులు చేయాలి. పిల్లలను పెంచడం అంత సులవైన విషయం కాదని గుర్తుపెట్టుకోవాలి.

నేచర్ లోకి తీసుకెళ్ళండి…
స్క్రీన్ చూసి తెలుసుకునే దానికన్నా ప్రకృతిలోకి తీసుకెళితే పిల్లలు మరింత ఎక్కువ తెలుసుకుంటారు. చదవడం, చూడ్డం వల్ల వచ్చే జ్ఞాసం కన్నా ప్రక్టికల్ గా నేర్చుకుంటే ఎక్కువ తెలుసుకుంటారు. నేచర్ లో ఉన్న అద్భుతాలను, వింతలను, సహజత్వాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. నీళ్ళలో గెంతనీయాలి, మట్టిలో ఆడనివ్వాలి, గడ్డిలో పరుగెట్టనివ్వాలి. ఇమ్యూనిటీ, రోగాలు అంటూ తలుపులేసి కూర్చోపెట్టకూడదు. అన్ని రకాల ఆటలను పరిచయం చేయాలి. గైమ్స్ మీద ఇంట్రస్ట్ కలిగేటట్లు చేస్తే ఆటోమేటిక్ గా స్క్రీన్ టైమ్ తగ్గిపోతుంది.