అందరినీ ఆకట్టుకోవడం ఓ కళ. కొంతమంది మాత్రమే తమ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. ప్రపంచం చాలా ఫాస్ట్ గా వెళిపోతోంది. మనం ఎప్పుడూ మరో వ్యక్తితో కలిసే పని చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ముభావంగా ఉండడం, మన పనేదో మనం అన్నట్టు ఉండడం కుదరని పని. అలా ఉంటే ఆఫీస్ వాతావరణం అస్సలు బావుండదు.మరి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా…
ఐ కాంటాక్ట్:
ఇతరులు మన మాటలను శ్రద్ధగా వినాలన్నా, వాళ్ళు మన మీద ఎక్కువ ఆసక్తి చూపించాలన్నా అవతలి వారికి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఎటో చూస్తూ మాట్లాడితే వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టు కాదు. కాబట్టి ఎప్పుడూ సూటిగా చూస్తూనే మాట్లాడాలి.
తగవులు వద్దు:
ఇతరులతో మనస్పర్ధలు వచ్చినప్పుడు మొదటిసారిగా మనమే మాటలు కలిపేందుకు ప్రయత్నించాలి. దీనివలన ఇతరులకు మనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలను సీరియస్ గా తీసుకోవడం మానేయాలి.
నవ్వుతూ ఉండాలి:
ఎవరినైనా కలిసినప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎదుటి వారిని ఎప్పుడూ నవ్వుతూ పలకరించాలి. ఇలా చేయడం వల్లన అక్కడ వాతావరణం ప్లెజెంట్ గా ఉంటుంది. అవతలి వాళ్ళు తొందరగా ఆకర్షితులవుతారు కూడా.
కించపరిచేలా మాట్లాడకూడదు:
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళని తక్కువ చేయకూడదు. ఎప్పుడూ అవతలి వారిలోని మంచితనం గురించే మాట్లాడాలి. ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడకూడదు. ఇలా చేయడం వలన మనపై అందరికీ మంచి అభిప్రాయం వస్తుంది.
ఆసక్తి తెలుసుకోవాలి:
ఎదుటి వ్యక్తికి ఎలాంటి విషయాల్లో ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. దాని గురించి మాట్లాడాలి. మనకు నచ్చినవన్నీ అవతలి వారికి నచ్చాలి అనుకోకూడదు. వాళ్ళకి నచ్చని విషయాల గురించి మాట్లాడకూడదు.
పేరు పెట్టి పిలవాలి:
ఎవరినైనా పేరుతోనే పిలవడం మంచిది. ఎదుటి వాళ్ళ పేర్లను గుర్తుంచుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన ప్రతీసారీ పేరు మెన్షన్ చేయడమే మంచిది.
శ్రద్ధగా వినాలి:
ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వినాలి. అది మనకు నచ్చని విషయం అయినా సరే చెబుతున్నప్పుడు వినడమే మంచిది. దీనివల్ల వాళ్ళకు మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
తప్పులు:
ఎదుటివారు చేసే తప్పులను ఎత్తి చూపకూడదు. మనకు తప్పు అనిపించవచ్చును కానీ వాళ్ళకు కాకపోవచ్చు. ఒకవేళ తప్పు అయినా కూడా వాళ్ళకు ఇబ్బంది కలగని విధంగా చెప్పాలి. బ్లేమ్ చేస్తున్నట్టు కాకుండా కూర్చోపెట్టి వివరించాలి.