ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి?  - MicTv.in - Telugu News
mictv telugu

ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి? 

March 25, 2020

uuuu

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పర్వదినంతోనే తెలుగు ప్రజలకు కొత్త్త ఏడాది ప్రారంభమవుతుంది. హిందువుల క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం తొలి నెల. ఈ  నెల తొలిరోజును చైత్ర శుద్ద పాడ్యమి. ఇదే ఉగాది.. హిందూ పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు. అలాగే మత్స్య అవతారం ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చింది అని కూడా అంటారు. అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక, కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. ఆది అంటే ప్రారంభం. కలిసి ఉగాది అయ్యింది. అంటే సృష్టి ఆరంభమైన రోజునే ఉగాది అంటారు. ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాల్లోనూ, పురాణాల్లోనూ పేర్కొననందున మీకు ఇష్టమైన దేవుడిని పూజించవచ్చు.

ఉగాది అంటేనే నూతన సంవత్సరాది కాబట్టి ఈ పండుగను కూడా అంతే కొత్తగా ఆహ్వానిస్తారు. వారం రోజుల నుండే పండుగ వాతావరణం మొదలవుతోంది. దూర ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లు ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి స్వంత ఊళ్లకు వస్తారు. ఇళ్లను, వ్యాపారస్తులు దుకాణాలను శుభ్రం చేసుకుంటారు. ఉగాది పండుగ ముఖ్యంగా వేసవి ముందు వస్తుంది. తద్వారా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పకనే సూచిస్తుంది. ఈ పండుగ రోజున ఉదయాన్నే కొన్ని ఎంపిక చేయబడిన నూనెలతో తలంటుకుని స్నానం చేయడం మూలంగా చర్మానికి, జుట్టుకు ఆరోగ్యాన్ని చేకూర్చవచ్చు. తలా స్నానం చేసిన తరువాత కొత్త సంవత్సరాది స్తోత్రాన్ని పఠించాలి.


ఏ పండుగ అయినా ఆయాకాలాలను అనుసరించి తయారుచేసే సాంప్రదాయక ఆహారాన్ని తీసుకోవడం ఆనవాయితీ. ఉగాది అంటేనే వేసవి కాలం  రాబోతుందనడానికి సూచన. దీంతో ఉదయాన్నే మామిడి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, మిరియాలు, చింతపండు, నిమ్మరసం, ఉప్పు, కొబ్బరి కోరు, అరటిపండులను కలిపి చేసిన షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తీసుకుంటారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. ఈ పచ్చడిని ఉగాది రోజున మొదలుపెట్టి, శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని తీసుకోవడం మూలంగా ఋతువుల్లో మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలేవీ రాకుండా ఉంటాయి.

ఉగాది రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తుంది. రాబోవు కాలాలలో తమ భవితవ్యాలు ఎలా ఉండబోతున్నాయో పంచాంగ శ్రవణ కర్తలు గుళ్లలో చెపుతుంటారు. వీరిచ్చే సూచనల ఆధారoగా సంవత్సరంలో కీలకమార్పులకు ఆలోచనలు చెయ్యగలరని పెద్దల విశ్వాసం.