రైలులో ప్రయాణించేటప్పుడు రైలు టిక్కెట్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఫోన్ లో కూడా చూపిస్తున్నారు. కానీ ఒక వేళ టిక్కెట్ పోతే
ఏం చేయాలో తెలుసా?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణించేటప్పుడు టిక్కెట్, గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే ఒకవేళ టిక్కెట్ పోగొట్టుకుంటే ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ టికెట్ పోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి అని అనుకున్నారా?
సమస్యకు పరిష్కారం..
మీరు పోగొట్టుకున్న టిక్కెట్ ను ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా తిరిగి పొందవచ్చు. అవును.. భారతీయ రైల్వే నిబంధనల్లో ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంది. మీరు పోగొట్టుకున్న టిక్కెట్ ను ఆన్ లైన్ లో తిరిగి పొందడానికి ఐఆర్సీటీసీ ఖాతాకు లాగిన్ అవ్వాలి. బుకింగ్ హిస్టరీ నుంచి డూప్లికేట్ టిక్కెట్ తిరిగి పొందవచ్చు. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. అయితే డూప్లికేట్ టిక్కెట్ తిరిగి పొందడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రుసుములు ఇలా..
స్లీపర్, సెకండ్ స్లీపర్ క్లాస్ కోసం డూప్లికేట్ టిక్కెట్ను తీసుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏసీ కోచ్ లో సీటు అయితే డూప్లికేట్ కి రూ. 100 తీసుకుంటారు. రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కన్ఫర్మ్ చేసిన టిక్కెట్ పోతే.. దానికోసం టిక్కెట్ ఛార్జీలో 50శాతం చెల్లించాలి. కన్ఫర్మేషన్ తర్వాత ప్రయాణీకుల టికెట్ చెరిగితే.. 25శాతం ఛార్జీతో డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు డూప్లికేట్ టిక్కెట్ జారీ చేయరు. రైలు బయలుదేరే ముందు మీరు పోగొట్టుకున్న ఒరిజనల్ టిక్కెట్ దొరికితే.. డూప్లికేట్ టిక్కెట్ ను తిరిగి రైల్వే కౌంటర్ లో ఇచ్చి.. అసలు టిక్కెట్ ను రైల్వే వారికి చూపించి డబ్బు తిరిగి పొందే సౌలభ్యం కూడా ఉంది.