చాలా మంది మధ్యతరగతి యువతకు విదేశీ యానం చేయాలని కోరికగా ఉంటుంది. కానీ వీసా, భాష, బడ్జెట్ సమస్యలతో వాటిని లోపలే అణచేస్తారు. కానీ, మన సరిహద్దు దేశమైన నేపాల్ లో పర్యటించడానికి ఇలాంటి అవరోధాలు అడ్డు కావు. భారతీయులు వెళ్లడానికి పాస్ పోర్టు, వీసా అవసరం లేదు. తక్కువ ఖర్చుతో పర్యటన పూర్తవుతుంది. అలాగే భాషాపరంగా ఇబ్బంది లేకుండా చాలా వరకు మేనేజ్ చేయవచ్చు. తిండి, వాతావరణం, ఆచార వ్యవహారాలు మనకు దగ్గరి సంబంధం ఉండడంతో తేలిగ్గా నేపాల్ చుట్టి రావచ్చు.
ఈ దేశంలో చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యంగా హిమాలయాలు ఒకటి. తర్వాత ఖాట్మండు, పశుపతినాథ్ దేవాలయం, తేయాకు తోటలు, బౌద్ధ శిల్పాలు, చిత్వాల్ నేషనల్ పార్క్, దర్బార్ స్క్వేర్, పోఖరా నగరం, కొండలు, గుట్టలు వంటివి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి నేపాల్ మంచి ఎంపిక. బస చేయడానికి హోటళ్లు, తిండి ఖర్చులు వంటివి ఒక్కరోజుకు రూ. 500లలో కూడా లభ్యమవుతాయి.
హాస్టళ్లలో ఉండాలనుకుంటే రూ. 150 కి కూడా దొరుకుతాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడుకుంటే డబ్బులు ఆదా అవుతాయి. నేపాల్ కి బస్సు, విమానాల్లో నేరుగా వెళ్లవచ్చు. విమానంలో అయితే ఢిల్లీ నుంచి ఖాట్మండుకి రూ. 5 వేలు, బస్సుల్లో అయితే రూ. 2500 తో చేరుకోవచ్చు. అయితే భారత పర్యాటకులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవడం తప్పనిసరి.