గర్భధారణ సమయంలో శారీరక మార్పులు సహజం. అనారోగ్యం కూడా ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి గర్భాధారణ సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మొదట్లో వికారం, తలతిరగడం వంటివి కనిపిస్తాయి. రెండో లేదా మూడో త్రైమాసికంలో కాళ్ల వాపు, బరువు పెరగడం, వెన్నునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీ స్త్రీలు కడుపు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటారు. ఏది తిన్నా కడుపు ఉబ్బరం ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణంకాదు. హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వల్ల ఇవన్నీ సంభవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇలా గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తినప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి:
ఫైబర్ కంటెంట్ కడుపులో జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని వల్ల మలవిసర్జన సక్రమంగా జరిగి కడుపులో వాత తగ్గుతుంది. మీ ఆహారంలో ఎండుద్రాక్ష, అత్తి పండ్లు, అరటిపండ్లు, అలాగే కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిలో 25 నుండి 30 గ్రాముల అధిక ఫైబర్ ఉంటుంది. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
నీరు ఎక్కువగా త్రాగాలి:
నీరు, ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలు మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా నిరోధించవచ్చు. సరైన జీర్ణక్రియకు నీరు కూడా ముఖ్యమైనది. తిన్న తర్వాత పుష్కలంగా నీరు త్రాగాలి.
భోజనంలో నెయ్యి ఉండాలి:
నెయ్యి పేగులను క్లియర్ చేస్తుంది. మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది అపానవాయువు సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అన్నంలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని తినండి. కడుపులో ఉన్న బిడ్డకు కూడా మేలు చేస్తుంది.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి
పప్పులు, సెమోలినా, సూజీ హల్వా వంటి ఆహారాలు గర్భధారణలో అద్భుతాలు చేస్తాయి. సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి. రోజుకు కనీసం 5-6 సార్లు తినడం సమస్య కాదు. కానీ ఒకేసారి ఎక్కువగా తినకూడదు.
శారీరక శ్రమ ఉండాలి
ఎవరికైనా మానసిక, శారీరక ఆరోగ్యానికి కనీసం కొంత శారీరక శ్రమ అవసరం. గర్భిణీ స్త్రీలకు కూడా వ్యాయామం మంచిది. కానీ నిపుణుల సలహామేరకు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం, యోగా చేయండి. దీని వల్ల ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్ట్రిక్ సమస్య దరిచేరదు.