తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందర్బంగా రాష్ట్రంలోని పేద మహిళలందరికీ కోటి చీరలను, కానుకగా ఇవ్వనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.సెప్టెంబర్ 18, 19, 20 తేదీలలో రేషాన్ షాపుల ద్వారా 1,04, 57,610 మందికి కులమతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలు పంచనున్నట్టు తెలిపారు. పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్టు సీఎం చెప్పారు.చీరల కార్యక్రమాన్ని స్వయంగా కలెక్టర్లు పర్యవేక్షించాలని కోరారు.
‘‘చేనేత కార్మికులు మరమగ్గాలను ఆధారం చేసుకొని బ్రతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. కార్మికులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేనేత కార్మికులకు పని కల్పిస్తోంది. 50 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబరాలు రెట్టింపు అవడంతో పాటు చేనేత కార్మికులు ఉపాధి పొందుతారు.. ’’ అని సీఎం అని ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షా కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎండీ శ్రీ సివి ఆనంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. పి సింగ్, చేనేత, జౌళి డెరెక్టర్ శ్రీమతి శైలజా రామయ్యన్, జాయింట్ డైరెక్టర్ శ్రీ వి. పూర్ణచందర్ రావు, జిఎం శ్రీ పి. యాదగిరి, సీఎంఓ అధికారి శ్రీ ఎస్. నర్సింగరావు, శ్రీమతి శాంతికుమారి, శ్రీమతి స్మితా సబర్వాల్, తదితరులు పాల్గొన్నారు.