Hug therapy, per hour Rs. 7 thousand..from where?
mictv telugu

కౌగిలింత వైద్యం, గంటకు రూ. 7వేలు..ఎక్కడంటే?

July 16, 2022

ఈ సమాజంలో ప్రతి మనిషికి బాధలు, కష్టాలు, దు:ఖాలు అనేవి సహజం. అవి ధనవంతులకైనా, పేదవారికైనా ఏదో ఒక రూపంలో ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో కొందరు ఏదైనా బాధ కలిగితే, వారిలో వారే బాధపడతారు. మరికొందరు తమ మనసుకు ఇష్టమైనవారితో ఆ బాధను పంచుకుంటారు. ఇంకా చెప్పలేనంత బాధ కలిగితే ఆ టైంలో ఏం చేయాలో తెలియక, ఏం చేస్తుంటారో వారికే తెలియదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఎవరికైనా బాధ కలిగితే తన వద్ద ఓ వైద్యం ఉందని, గంటకు రూ.7వేల ఖర్చు అవుతుందని, బాధలో ఉన్నవారిని తన కౌగిలింతలతో ఓదారుస్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరో? ఏ దేశానికి చెందినవాడో? తెలుసుకుందామా..

బ్రిటన్ దేశంలోని బ్రిస్టల్‌కు ప్రాంతానికి చెందిన హూటన్ అనే వ్యక్తి..ఎవరైనా బాధతో, ఆవేదనతో, ఒంటరి తనంతో, దిగులుతో ఉంటే, వారి వద్దకు వెళ్లి, తన కౌగిలింతలతో ఓదారుస్తున్నాడు. బాధితులు చెప్పిన ప్రతి బాధను ఓర్పుగా వింటున్నాడు. చివరికి వారి ఆందోళన పూర్తిగా తగ్గేవరకు తన కౌగిలింతలతో వైద్యం చేస్తున్నాడు. ఊరికే కాదండి.. అతను ఇలా ‘కడల్ థెరపీ’ చేయడానికి గంటకు 75 పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7వేలను వసూలు చేస్తున్నాడు.

బ్రిస్టల్ నగరంలో నివసించే ఈ ప్రైవర్ హూటన్.. మొదట ఒంటరితనంతో, మానసికంగా క్షోభపడేవారికి స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ వైద్యాన్ని మొదలుపెట్టాడట. కాలక్రమంలో దీనినే వృత్తిగా చేసుకున్నాడట. అయితే, ఈ ‘కడిల్ థెరపీ’ ఇవ్వడం వల్ల ఇతరులతో మంచి బంధం, అనుబంధం ఏర్పడి, వారిలో ఉన్న బాధ చిన్న చిన్నగా తగ్గి, నార్మల్ స్టేజ్‌కు వస్తారట.

హూటన్ మాట్లాడుతూ..”నా పని ప్రజలు అనుకున్నంత సులభం కాదు. దీని కోసం ఎదుటివారి మనసుని అర్ధం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. నేను ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు.. వారి దుఃఖాన్ని పంచుకుంటూ, ఓదార్పునివ్వాలని బాధితులు భావిస్తారు. అందుకు అనుగుణంగా నేను స్పందించాల్సి ఉంటుంది. నేను చేస్తోన్న పనిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ, నేను ఎటువంటి కామెంట్స్‌ను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. బాధలో ఉన్న వారిని ఓదారుస్తున్నా” అని ఆయన అన్నాడు.