Huge changes Team India in future
mictv telugu

టీం ఇండియాలో భారీ మార్పులు…వారందరూ ఔట్

November 11, 2022

T20 వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత్ ఓటమి తీవ్ర దుమారం రేపుతోంది. భారత్ ఆటగాళ్లుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారైన కప్పుతో తిరిగొస్తారని ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. సెమీస్‌ మ్యాచ్‌లో కనీస పోటీ ఇవ్వకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడం జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి భువనేశ్వర్ కుమార్ వరకు అందరినీ తిట్టిపారేస్తున్నారు. జట్టు ఎంపికపైనా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో టీం ఇండియాలో భారీగా ప్రక్షాళనలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. సీనియర్లందరినీ తప్పించి యువకులకు స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. దీని కోసం బీసీసీఐ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మాజీలు భావిస్తున్నారు. నిజానికి కుర్రాళ్ల ఆటగా టీ20కి పేరుంది. అయితే భారత్ వరల్డ్ కప్ టీంలో ఒకరిద్దరు తప్ప అందరూ 30 దాటిన వాళ్లే ఉన్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను టీ20ల నుంచి క్రమంగా తొలగించి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో భారీ మార్పులు తప్పవని ఇప్పటికే బీసీసీఐ అధికారి ఒకరు చెప్పడం దీనికి బలం చేకూరుతుంది.

ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రస్తావించారు. రోహిత్‌ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. టీం ఇండియా భవిష్యత్తు కెప్టెన్ అతడే అని తేల్చేసాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత కొంతమంది ఆటగాళ్లు రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారని సునీల్ గవాస్కర్ స్పష్టం చేసారు.