కోలుకున్న కాంగ్రెస్ నేత.. ఫ్యాన్స్ హంగామా, కరోనాకు పండగ - MicTv.in - Telugu News
mictv telugu

కోలుకున్న కాంగ్రెస్ నేత.. ఫ్యాన్స్ హంగామా, కరోనాకు పండగ

May 31, 2020

Maharashtra

మనషులు గుమికూడితే కరోనాకు పండగే. అలా గుమిగూడవద్దని ఇప్పటికే ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయినా కొందరు ‘ఆ.. అది మమ్మల్ని ఏం చేస్తుందిలే?’ అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత చంద్రకాంత్‌ హందోరే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది, కోలుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నంత పనిచేశారు. యుద్ధంలో గెలిచి వచ్చిన యోధుడి మాదిరి ఆయనకు ఘన స్వాగతాలు పలికారు. ఆయన అలా కారు దిగగానే ఇలా పొలోమంటూ ఒక్కసారిగా జనాలు గుమిగూడారు. 

తమ అభిమాన నాయకుడిని తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు పోటీలు పడ్డారు. ముఖాల మీద ఒక్కరికీ మాస్కులు లేవు. భౌతిక దూరం అనే ధ్యాస మరిచి అరుపులు, కేకలతో ఉర్రూతలూగిపోయారు. మరికొందరైతే మరింత రెచ్చిపోయి బాణసంచా కూడా కాల్చారు. అసలే ముంబయిలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసి కూడా ఆ పెద్ద మనిషి అభిమానుల హర్షధ్వానాలను ఎంజాయ్ చేయడం అస్సలు బాగాలేదని నెటిజన్లు రుసరుసలాడుతున్నారు. ఇప్పటికే ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 39 వేలకు చేరుకుంది.  మహారాష్ట్ర వ్యాప్తంగా 65వేలు దాటింది. రోజూ వందలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. 100కు పైగానే మరణాలు సంభవిస్తున్నాయి. అయినా, వీరిలా ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి.