ఘోర అగ్నిప్రమాదం.. డాక్టర్ సజీవదహనం.. ఇద్దరు పిల్లలు కూడా..
తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఓ వైద్యుడి కుటుంబం మృతి చెందింది. ప్రమాదంలో వైద్యుడు అక్కడే సజీవ దహనం కాగా, ఆయన కుమార్తె, కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. రేణిగుంటలోని భగత్‌సింగ్ కాలనీలో కార్తీక పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అదే ఆసుపత్రి భవనం పైన రవిశంకర్‌రెడ్డి కుటుంబం ఉంటోంది. ఈ ఉదయం డాక్టర్ కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీనిపై సమాచారం అందుకున్న తిరుపతి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత స్థానికులు గమనించి వెంటనే రవిశంకర్‌రెడ్డి భార్య, తల్లిని కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం వైద్యుడి కుమారుడు భరత్ (12) కుమార్తె కార్తీక (15)లను పైఅంతస్తు నుంచి కిందికి దించారు. వాళ్లిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు కూడా మృతిచెందారు. రవిశంకర్‌రెడ్డి మాత్రం మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.