నెల్లూరు జిల్లాలో భారీ బంగారు నిక్షేపాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

నెల్లూరు జిల్లాలో భారీ బంగారు నిక్షేపాలు..

May 17, 2022

ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ బంగారు నిక్షేపాలను వెతికే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. జిల్లాలో ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి , వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నాయని ఎప్పటినుంచో టాక్. దీంతో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆ కొండపై ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. కొంతకాలంగా ఈ తవ్వకం పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సిబ్బంది కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్‌ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. నమూనాల ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి నిక్షేపాలున్నట్లు గుర్తించింది.

దీంతో సోమవారం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు హైదరాబాద్‌ నుంచి వాహనంతో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి.. కనీసం ఖనిజ నిక్షేపాలతోనైనా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.