అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువలో తేడాలు, స్టాక్ మార్కెట్ ప్రభావం, కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ సంక్షోభం.. కారణం ఏదైనా, అసలు ఏ కారణం లేకపోయినా బంగారం ధరలు నిత్యం పెరిగిపోతుండడం భూమి గుండ్రంగా ఉందన్నంత సహజం. స్వల్పకాలికంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా దీర్ఘకాలంలో ధరలు పెరుగుతూనే ఉంటాయి. పది గ్రాములపై వందో, ఐదొందలో, మహా అయితే వెయ్యో పెరుగుతుంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చుక్కలు చూపిస్తుంటుంది. ఈ రోజు(శనివారం) అంతకంటే దారుణంగా చుక్కలను కూడా దాటిపోయినంత పరిస్థితి నెలకొంది. పసిడి ధర 60 వేల మార్క్ దాటిపోయింది. 24 కేరట్ల, 22 కేరట్ల రకాలు వెయ్యిన్నర పెరుగుదల నమోదు చేశాయి.
శనివారం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారు 10 గ్రాములకు రూ. 1500 పెరిగి రూ. 55,300కి చేరుకుంది. 24 కేరట్ల మేలిమి బంగారం రూ. 1,630 పెరిగి, రూ. 60,320 వద్ద నిలిచింది. ఇటీవల కాలంలో ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి, పెళ్లి సీజన్లలో భారీ పెరిగి కొన్నాళ్లు తగ్గిన పసిడి ధరలు కొన్ని రోజులుగా మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇక వెండి కేజీగా ఏకంగా రూ. 1300 పెరిగి రూ. 74,400 వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండికి డిమాండు పెరగడంతో మూడు నాలుగు నెలల కిందున్న 78 వేల మార్కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. డాలర్ విలువ తగ్గడం, అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాలా తీయడం, ఉక్రెయిన్ యుద్ధం వంటి పలు జాతీయ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. ఆర్థిక సంక్షోభం, మార్కెట్ల బలహీనతతో ఇన్వెస్టర్లు పసిడిని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో ధరలు మండుతున్నాయి. బంగారం, వెండి ధరలు 10 నెలలుగా భారీగా పెరుగుతూ రెండేళ్ల కిందటి ధరలను గుర్తు చేస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే బంగారం ధర 65 వేలు, వెండి 80 వేలు దాటిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.